హస్తం పార్టీలో పదవుల సెగ: వారి సిఫారసు ఉంటేనే సీటు

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జిల్లా కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంది.

హస్తం పార్టీలో పదవుల సెగ: వారి సిఫారసు ఉంటేనే సీటు
X

దిశ, వరంగల్ బ్యూరో : జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో కీలక పదవుల కోసం ఆశావహులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాని వారు ఈసారి ఎలాగైనా జిల్లా కార్యవర్గంలో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు. కమిటీల ఎంపికలో మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం కావడంతో వారి చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం భారీ కమిటీలను సిద్ధం చేస్తోంది. ములుగు, భూపాలపల్లి మినహా మిగిలిన నాలుగు జిల్లాలకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరింది. పాత నేతలతోపాటు కొత్తగా చేరిన వారు కూడా పదవుల కోసం పట్టుబట్టడం రసవత్తరంగా మారింది. పీసీసీ నేతృత్వంలో సామాజిక సమీకరణాలను బట్టి జంబో కార్యవర్గాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో పదవుల కోసం నేతలు తీవ్రస్థాయిలో పట్టుపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, నామినేటెడ్ పదవులు దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు జిల్లా కార్యవర్గంలోనైనా చోటు సంపాదించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కమిటీల కూర్పులో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం కావడంతో, ఆశావహులంతా వారి నివాసాల వద్ద క్యూ కడుతున్నారు. తమ విధేయతను చాటుకుంటూనే, కీలక పదవులు ఇప్పించాలని సిఫారసులు చేయించుకుంటున్నారు. పార్టీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్లతో పాటు ఇటీవల చేరిన వారు కూడా పోటీలో ఉండటంతో ఈ ప్రక్రియ రసవత్తరంగా మారింది.

ఎన్నికల వ్యూహం.. జంబో కార్యవర్గాలు

రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జిల్లా కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంది. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా భారీ కార్యవర్గాలను ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలకు కమిటీలను ఖరారు చేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, భూపాలపల్లి జిల్లాలను ప్రకటించారు. ప్రస్తుతం మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ జిల్లాల్లో పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో వడపోత కార్యక్రమం సాగుతోంది.

సామాజిక సమీకరణాలు.. పైరవీల పర్వం

మండలాల వారీగా ఎమ్మెల్యేలు ఎవరి పేర్లు సిఫారసు చేస్తారో వారికే పదవులు వస్తాయన్న ప్రచారంతో నాయకులు నిత్యం వారిని కలుస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలనే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల ద్వారా కూడా ఒత్తిడి తెస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని కాపాడామని, అప్పట్లో లాఠీ దెబ్బలు తిన్న తమకు ఇప్పుడు గుర్తింపు ఇవ్వాలని కొందరు వాపోతున్నారు. మరికొందరు నేరుగా హైదరాబాద్ వెళ్ళి పీసీసీ అధ్యక్షుడిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సామాజిక వర్గాల వారీగా ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా జంబో కార్యవర్గాలను ప్రకటించే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

గ్రేటర్ ఎన్నికలపైనే ప్రత్యేక ఫోకస్

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రాబోయే గ్రేటర్ ఎన్నికలే ప్రధాన అజెండాగా కనిపిస్తున్నాయి. నగర పరిధిలో కీలకంగా పనిచేసే వారికి, ప్రజల్లో పట్టున్న వారికి జిల్లా కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చేందుకు మంత్రులు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కమిటీలో పదవి ఉంటే స్థానికంగా పనులు చేసుకునేందుకు, అధికారుల వద్ద పరపతి పెంచుకునేందుకు వీలవుతుందని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు తమ శక్తిమేర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వెలువడనున్న ఈ జాబితాల్లో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి.

Next Story