తెల్లబంగారానికి కరువైన మద్దతు ధర

by Naga Rani Yarlagadda |

ఉమ్మడి జిల్లాలో తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తికి ఈ యేడు ధర లేదు. భారీ వర్షాలతో పంట దెబ్బతినగా దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తెల్లబంగారానికి కరువైన మద్దతు ధర
X

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలో తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తికి ఈ యేడు ధర లేదు. భారీ వర్షాలతో పంట దెబ్బతినగా దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న పంటను అకాల వర్షాలు దెబ్బతీస్తుండటం, మార్కెట్ కు వస్తే ధర లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పండిన పత్తిని అమ్మినా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించినా మద్దతు ధర వస్తుందో రాదో అనే టెన్షన్ నెలకొంది. ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని మార్కెట్ యార్డులతో పాటు ఎంపిక చేసిన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలుకు సిద్ధమవుతుంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతుల పత్తిని సీసీఐ కొనుగోలు చేయనుంది. రైతులు, రైతు సంఘాల నేతలు మాత్రం కొర్రీలు పెట్టకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్​చేస్తున్నారు.

భారీగా తగ్గిన దిగుబడి..

ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదున్నర లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఈ యేడు ధర వస్తుందనే నమ్మకంతో ఎక్కువమంది రైతులు సాగుచేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పడిన భారీ వర్షాలతో నీళ్లు నిలిచి పంట దెబ్బతింది. ఆరు జిల్లాల పరిధిలో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఉన్న పంట కూడా అకాల వర్షాలతో దెబ్బతింటుంది. పత్తి చేనులోనే తడిసి నల్ల బడుతోంది. ఏరిన పత్తి కూడా ఆరబోసినా ఫలితం ఉండడం లేదు. ఈ యేడు వర్షాలతో దిగుబడి తగ్గింది. ఎకరాకు పది క్వింటాల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేసినా ప్రస్తుతం 5 నుంచి 8 క్వింటాళ్ల వరకే వస్తుంది. కొంతమంది రైతులకు అంతకన్నా తక్కువ దిగుబడి వస్తోంది.

దక్కని మద్దతు ధర..

ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని రైతులు అమ్మకానికి మార్కెట్ కు తీసుకురాగా మద్ధతు ధర మాత్రం రావడం లేదు. సీసీఐ మద్దతు ధర 8110 ఉండగా మార్కెట్ లో మాత్రం రూ.5వేల నుంచి రూ.7వేల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. మోడల్ ధర రూ.6వేల నుంచి రూ.6,500 మధ్య వస్తుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో గడిచిన నెలరోజులుగా వ్యాపారులే పత్తిని కొనుగోలు చేశారు. సీసీఐ కేంద్రాలు రాకపోవడంతో ధర రాలేదు. వ్యాపారులు సిండికేటుగా మారడంతో ధర తగ్గిపోయింది. దిగుబడి వచ్చిన పత్తిని కూడా మార్కెట్ కు తీసుకువస్తే మద్దతు ధర లేకపోవడంతో కనీస గిట్టుబాటు కావడం లేదంటున్నారు రైతులు. పెట్టిన పెట్టుబడులకు, కూలీలకు సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.

సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం..

ఎట్టకేలకు ప్రభుత్వం చొరవ చూపడంతో సీసీఐ కొనుగోళ్లను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తేమ శాతం బట్టి మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో అధికారికంగా పత్తి కొనుగోళ్లను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. మండలాల పరిధిలో కూడా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లను చేస్తున్నారు. రైతులు, రైతు సంఘాల నేతలు మాత్రం కొర్రీలు పెట్టకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

ఈ యేడు వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 5 క్వింటాలు కూడా వస్తలేదు. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. పత్తి ఏరిన కూలీలకు కూడా డబ్బలు సరిపోవడం లేదు. వచ్చిన పంటను మార్కెట్​లో విక్రయిస్తే మద్దతు ధర ఇవ్వడం లేదు. ప్రభుత్వమే పత్తి రైతులను ఆదుకోవాలి. –కితా రాజన్న , నీరుకుల్లా గ్రామం.

పత్తికి మద్దతు ధర రావడం లేదు

వర్షాలు తట్టుకుని పత్తిని పండించిన ధర రావడం లేదు. వ్యాపారులు మద్దతు ధర పెట్టడం లేదు. వచ్చిన ధర కూలీలకు సరిపోవడం లేదు. క్వింటాలుకు రూ.10 వేల ధర వస్తే రైతుకు నష్టం ఉండదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ సారి పత్తిరైతుకు పెట్టుబడి పైసలు కూడా రావడం లేదు. –చిట్టి బొమ్మల రవి, పెంచికల పేట.

Next Story