రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం

by Kodari Anjali |

గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: జిల్లాలోని గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యు వాతపడ్డారు. అతివేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా అదుపు తప్పిన లారీ పంట పొలాలోకి దూసుకుపోవడంతో లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోయారు. తెలిసిన వివరాలు ప్రకారం.. గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన అర్రెమ్ బిక్షపతి (48), ఈక చిన్నప్పయ్య (50) అనే వ్యక్తులు తమ సొంత గ్రామం నుండి ములుగు జిల్లా కేంద్రానికి వస్తున్న సమయంలో చత్తీస్గఢ్ నుండి వస్తున్న లారీ వెనుక నుండి టీఎస్ 05 ఈఆర్ 4597 అనే నెంబర్ గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఈ సమయంలో లారీ వేగాన్ని అదుపు చేయలేని డ్రైవర్ సమీపంలోని పంట పొలాలకు లారీ దూసుకుపోయి చెట్టును ఢీకొనడంతో లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోయారు. ఈ సందర్భంలో గ్రామస్తులు, వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీయడానికి నానా తంటాలు పడ్డారు. గతంలో ఇదే గ్రామ సమీపంలో పలుసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story