ఏనుమాముల మార్కెట్‌లో ఆ ఒక్కటే ఎత్తుకెళ్లారు!

by Chintha Aamani |   (  Updated:2025-08-06 11:56:56  IST  )

ఏనుమాముల మార్కెట్ లో దొంగలు పడ్డారా? పడితే ఆ ఒక్క బుక్కే ఎత్తుకెళ్లారా? లేదంటే బుక్కుకు చేతులొచ్చాయా? కాళ్లు వచ్చాయా? అనే సందేహాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఏనుమాముల మార్కెట్‌లో ఆ ఒక్కటే ఎత్తుకెళ్లారు!
X

దిశ,వరంగల్‌ టౌన్ : ఏనుమాముల మార్కెట్ లో దొంగలు పడ్డారా? పడితే ఆ ఒక్క బుక్కే ఎత్తుకెళ్లారా? లేదంటే బుక్కుకు చేతులొచ్చాయా? కాళ్లు వచ్చాయా? అనే సందేహాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. లక్ష్మీపురం మార్కెట్‌ నిర్వహణ వ్యవహారాలు పొందుపరిచిన ఆ బుక్కు మాయమవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. సూపర్‌వైజర్‌ ఆధ్వర్యంలో ఉండాల్సిన బుక్కు ఎలా మాయమైంది? ఎవరు కాజేశారు? దానితో ఎవరికి అవసరం ఉంటుంది? అనే అనుమానాలు రేకెత్తుతుండగా.. సమాధానం చెప్పేవారు కరువయ్యారు.

వ్యాపారుల గుట్టు అందులోనే!

లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు కేటాయించిన షాపులు, రిటైల్‌ వ్యాపారులకు చెందిన ఓపెన్‌ ప్లాట్లు, గద్దెలకు సంబంధించిన వ్యాపారుల వివరాలు అన్నీ ఆ బుక్కులోనే నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాట్‌మెంట్‌ బుక్కుగా పేర్కొనే ఆ బుక్కు కొంతకాలంగా కనిపించడం లేదని అధికార వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మార్కెట్‌లో బినామీ వ్యాపారులు పెరిగిపోయారని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. అడ్తీ, కమీషన్‌ వ్యాపారులే ఓపెన్‌ ప్లాట్లు తమ ఆధీనంలో పెట్టుకుని ఇతరులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. అలాగే గద్దెల ప్రాంగణంలో కూడా ఒక్కో వ్యాపారికి నాలుగైదు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఏకంగా పది వరకు గద్దెలు కేటాయించినట్లు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఏ షాపు ఎవరికి కేటాయించారు? ఏ ప్లాటు ఎవరి పేరు మీద ఉందో? ఆ వివరాలు అలాట్‌మెంట్‌ బుక్కులో పొందుపరిచినట్లు చెబుతున్న అధికారులు.. ఇప్పుడు ఆ బుక్ లేదనడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.

మంత్రి అడగకపోతే..?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక.. మంత్రి కొండా సురేఖ మార్కెట్‌ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది వ్యాపారులు.. మార్కెట్‌లో బినామీలు పెరిగిపోయారని మంత్రికి వివరించారు. ఇదే విషయం కలెక్టర్‌ చెవికి కూడా చేరింది. ఈ క్రమంలో మంత్రి, కలెక్టర్‌ మార్కెట్‌ను సందర్శించిన సందర్భంలో మార్కెట్‌లో షాపులు, ఓపెన్‌ ప్లాట్ల కేటాయింపు వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాల ప్రకారం.. వ్యాపారులకు ఐడీ కార్డులు కూడా జారీ చేయాలని నిర్ణయించారు. అయితే, అప్పటికి గానీ, ఆ బుక్కు మాయమైందనే విషయం బయటకు పొక్కలేదు. ఒకవేళ మంత్రి అడగక పోయి ఉంటే.. ఆ బుక్కు విషయం గుట్టుగా ఉండేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఇప్పుడెలా?

అసలు ఆ బుక్కు ఎలా మాయమైందో అధికారులు కూడా నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది. గతంలో మార్కెట్‌ సూపర్‌వైజర్‌గా చేసిన ఉద్యోగి ఇప్పుడు లేరు. ఆయన బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఉన్న సూపర్‌వైజర్‌ తనకు అప్పగించలేదని చెబుతుండడం గమనార్హం. మార్కెట్‌ నిర్వహణకు సంబంధించిన బుక్కు మాయమైతే.. కార్యదర్శులు ఏం చేస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. ఆ బుక్కు లేకుండా మార్కెట్‌ ఫీజు ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు? అసలు వసూలు చేస్తున్నారా? లేదా? అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. వ్యాపారుల నుంచి మార్కెట్ ఫీజు ఎలా వసూలు చేస్తున్నారో? అర్థం కాని దుస్థితి. మోకా మీద ఎవరుంటే వారి నుంచే వసూలు చేస్తున్నారా? కుళ్లుగుత్తగా ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి వసూలు చేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలా చేస్తే.. బినామీలను ఏరివేయడం సాధ్యమవుతుందా? అనే విషయంపై అధికారులే నోరు విప్పాలి. ఇప్పటికే మార్కెట్‌లో టీఆర్‌ల బాగోతంతో కార్యదర్శులపై వేటు పడింది.

మొన్నటికి మొన్న తక్‌పట్టీల ధరల్లో తేడాలతో పలువురు అధికారులకు, వ్యాపారులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడీ అలాట్‌మెంట్‌ బుక్కు మాయమైన సంఘటనలో ఎవరు బలి కానున్నారనే విషయం పక్కన పెడితే.. కీలకమైన రికార్డులను భద్రపరచలేని ఉద్యోగులు.. విధుల నిర్వహణలో ఎంత అలసత్వంగా ఉంటున్నారో స్పష్టమవుతోంది. వేలకు వేలు వేతనాలు తీసుకుంటూనే లంచాలకు అలవాటు పడి సర్కారుకు నష్టం కలిగించడానికి వెనుకాడని ఉద్యోగులు ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే. సమాజంలో ఎంతో మంది యువకులు నిరుద్యోగులు పనుల కోసం పడిగాపులు కాస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను తక్షణమే తొలగించే.. వారి స్థానంలో నిరుద్యోగులను తక్కువ వేతనంతోనైనా నియమిస్తే.. మిగతా ఉద్యోగుల్లో భయం మొదలై, విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story