గందరగోళంగా ఓటరు జాబితా

by velandi.Saikiran |

రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఒకటో తేదీన నర్సంపేట మున్సిపల్ అధికారులు అందించిన ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

గందరగోళంగా ఓటరు జాబితా
X

గందరగోళంగా ఓటరు జాబితా

=ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో..

=పక్క జిల్లా, మండలాల ఓటర్లు మున్సిపాలిటీలో..

=నర్సంపేటలో తప్పులతడగా జాబితా

=మా దృష్టికి వచ్చింది..తొలగిస్తాం: మున్సిపల్ కమిషనర్

దిశ, నర్సంపేట: రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఒకటో తేదీన నర్సంపేట మున్సిపల్ అధికారులు అందించిన ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అక్రమ ఓట్లను ముందుగానే కట్టడి చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడంతో తప్పిదం జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నర్సంపేట మున్సిపాలిటీ లో గతంలో 24 వార్డులు ఉండేవి. ఇటీవల నర్సంపేట మండలంలోని 8గ్రామాలు విలీనం కావడంతో వార్డుల సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో ఓటర్ల సంఖ్యలో మార్పులు, చేర్పులు సహా పెద్ద ఎత్తున అక్రమ ఓట్లు చేరినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు పార్టీల నాయకులు ఆరోపణలు సైతం చేస్తున్నారు. గతంలో ఒక వార్డులో ఉన్న ఓట్లు మరొక వార్డులో రావడం సహా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కాకుండా వేరే మండలాలకు సంబంధించిన ఓటర్లు, వేరే జిల్లాలకు సంబంధించిన బోగస్ ఓట్లు కూడా నమోదైనట్లు ఆధారాలతో స్పష్టం చేయడం గమనార్హం.

ఎవరి లాభం కోసం ఈ ప్రయత్నం..!

నర్సంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం క్రితం ఓటర్ల లిస్టును మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మొత్తం 30 వార్డులకు గాను దాదాపు 40వేలకు పైగా ఓట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధం లేని ఓట్లు స్థానికంగా చూపెట్టడం విమర్శలకు కారణం అవుతోంది. ఎవరి మేలు కోసం ఈ ప్రయత్నం చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

నకిలీ ఓట్లు మా దృష్టికి వచ్చాయి..తొలగిస్తాము: మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్

ఈ నెల ఒకటవ తేదీన నర్సంపేట మున్సిపాలిటీ ఓటర్ల లిస్టును ప్రకటించాం. అభ్యంతరాలు తెలపాలని కోరాం. కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. పార్టీల మీటింగ్ సైతం ఈ నెల 5వ తేదీన పెట్టాం. వాళ్లు సైతం పలు అభ్యంతరాలు లేవనెత్తారు. బోగస్ ఓట్లను ఏరివేస్తాం. ఈ నెల 10 వ తేదీన ఫైనల్ లిస్టును రెడీ చేస్తున్నాం. ఆ తేదీలోపు మున్సిపాలిటీ కి సంబంధం లేకుండా ఉన్న అన్నిఓట్లను తప్పనిసరిగా తొలగిస్తాం.

Next Story