గౌడ సోదరుల భద్రతే ప్రధాన లక్ష్యం....

by Taduka Kalyani |

ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

గౌడ సోదరుల భద్రతే ప్రధాన లక్ష్యం....
X

దిశ, ధర్మసాగర్: ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు సంబంధించిన 678 మంది గౌడ సోదరులకు కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..... గౌడ సోదరులు ప్రమాదాలకు గురి కాకుండా వారికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 10వేల రూపాయల విలువ చేసే ఈ రక్షణ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రమాదం జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి

శిక్షణ పొంది రక్షణ కిట్లు తీసుకున్న గౌడ సోదరులు వాటిని పక్కన పెట్టకుండా తప్పకుండా ఉపయోగించాలని సూచించారు. గ్రామాలలో కుల సంఘాల ఆధ్వర్యంలో రక్షణ కిట్లను ఉపయోగించే విధంగా చూడాలని అలాగే ఎక్సైజ్ శాఖ వారు పంపిణీ చేసిన రక్షణ కిట్లు ఉపయోగిస్తున్నారో లేదో అని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధ పడటం కంటే ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మొత్తం 1679 కాటమయ్య రక్షణ కిట్లు మంజూరు అయ్యాయని ఈ రోజు పంపిణీ చేసుకుంటున్న 678 తో కలుపుకొని ఇప్పటి వరకు 1558 రక్షణ కిట్లను పంపిణీ చేసుకున్నామని తెలిపారు. ప్రమాదానికి గురైన కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌడ కులస్తులు, కల్లు గీతా కార్మికులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story