గ్రామాల్లో ‘బెల్ట్’ జోరు..

by Elthuri vijay kumar |

కేసముద్రం మండలంలో బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.

గ్రామాల్లో ‘బెల్ట్’ జోరు..
X

గ్రామాల్లో ‘బెల్ట్’ జోరు..

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

ఆబ్కారీ అండదండలే అసలు కారణం

మందుబాబులకు 24గంటలు అందుబాటులో మద్యం

చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ

దిశ, కేసముద్రం: కేసముద్రం మండలంలో బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. పల్లెలు,పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులైపారుతోంది. జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు,పట్టణాలనే తేడా లేకుండా కిరాణా దుకాణం నుంచి మొదలుకొని నివాసగృహాలు, పాన్ షాపు లలో, మద్యం ఏరులై పారు తోంది. భవననిర్మాణ కార్మికులకు, కూలీలకు, ఇసుక రవాణా కార్మికులకు తెల్లవారు జామునే మద్యం అందిస్తూ బెల్టు దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. గతంలో వైన్ షాపుల పరిసరాలలో కొనసాగినప్పటికి ఈ దందా ప్రస్తుతం గల్లీకొకటి ఏర్పాటు కావడంతో మద్యం ప్రియులు ఉదయం టీ,కాఫీలకు బదులుగా మద్యంను తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ గాయాలపాలవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టుదుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. లిక్కర్ డాన్లు కమీషన్లకు బెల్టు షాపుల వారికి మద్యం సరఫరా చేస్తున్నారు. రోజుకు ఎంత అమ్మితే అంత కమీషన్లు అందిస్తుండడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఒకరిని చూసి మరొకరు ఈ దందాను జీవనోపాధిగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందాను బహిరంగంగా కొనసాగిస్తూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ దందా, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు ప్రకటిస్తుంటే.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయి. బెల్టు షాపు ల విచ్చలవిడి తనానికి కారణం ఆబ్కారీల అండదండలనే విషయం పాలు మరిసిన పిల్లవాడు చెపుతాడు.

ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు

మండల వ్యాప్తంగా సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బాటిళ్ పై ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.100 లు ఎక్కువకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు కన్నం పెడుతున్నారు. కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా వారం,నెలకు చొప్పున ముడుపులు అందుతుండడంతో ఏదైనా ఫిర్యాదురాగానే బెల్టు షాపుల నిర్వాహకులకు సమాచారం అందించి తనిఖీల విషయాలను చేరవేస్తున్నారు. దీంతో అప్రమత్తం అవుతున్న బెల్టు షాపుల వారు తనిఖీలలో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తేనే ఈ బెల్టుదందాకు అడ్డుకట్ట పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వారవుతారనీ, ప్రజల జేబులకు పడిన చిల్లులు ఆగుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువత మాత్రం నిత్యం వీటికి బానిస అయ్యి ఒళ్లు గుళ్ల చేసుకుని భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇకనయినా ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి సారించాలి. బెల్ట్ షాప్ నిర్వాహకుల మీద ఉక్కు పాదం మోపాలి. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల మన్ననలు పొందాలి అని ఆశిద్దాం..

లాభం ఎవరికి

విచ్చలవిడి బెల్ట్ షాపులతో లాభం ఎవరికి అని ఆలోచిస్తే అసలు నిజం తెలుస్తుంది. మద్యం ప్రియులకి కానీ ప్రభుత్వానికి కానీ లాభం లేదు, ఉదాహరణకు.. ఒక బీరు రూ.190 అనుకుంటే దానిని వైన్స్ వారు బెల్ట్ షాపుకి రూ.40 నుండి రూ.60 ఎక్కువతో విక్రయిస్తారు. దానిని బెల్ట్ షాపు నిర్వాహకులు మద్యం ప్రియులకు రూ.80 ఎక్కువ చెప్పి రూ.250 కి విక్రయిస్తారు. ఇందులో మద్యం సప్లై చేసే ప్రభుత్వానికంటే మధ్య దళారులైన వైన్స్ షాప్ యజమానులకు , బెల్ట్ షాపు నిర్వాహకులకు 150 శాతం లాభం చేకూరుతోంది. ఇందులో ఇంకొక విషయం దాగుంది వినియోగదారుడి కంటే బెల్ట్ షాపు వారికి ఇస్తే లాభం వస్తుంది కనుక వైన్స్ షాప్ యజమానులు సరుకు బ్లాక్ చేసి మరీ బెల్ట్ షాపు వారికి మాత్రమే అమ్ముతున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఆబ్కారీ అధికారులకు అందరికంటే ఎక్కువ లాభం... అటు వైన్స్ షాప్ యజమానులు, ఇటు బెల్ట్ షాపు నిర్వాహకులు ఇద్దరూ మామూళ్లు ఇస్తూ ఆబ్కారీ అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకొని మందు ప్రియుల డబ్బులు దోచుకుంటున్నారు.

Next Story