- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏజెంట్లదే హవా
ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లదే హవా కొనసాగుతోంది. వారి ద

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లదే హవా కొనసాగుతోంది. వారి ద్వారానే అన్నీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒకొక్క డాక్యుమెంట్ కు వేలాది రూపాయలు కమీషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నేరుగా వెళ్లే డాక్యుమెంట్లకు కొర్రీలు వేసి వాయిదాలు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏ సబ్ రిజిస్ట్రార్ లో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు. వారు వెళ్లే సమయంలోనూ వీరే దర్శనమిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కూడా వారే పట్టుకొని పోతున్నారు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను కూడా బ్రోకర్ల చేతికి అందిస్తున్నారు. డబ్బులు చేతులు మారితేగానీ ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనులు జరగడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. హన్మకొండ, వరంగల్, భీమదేవరపల్లి, కొడకండ్ల, జనగాం, మహబూబాబాద్, నర్సంపేట్, పరకాల భూపాలపల్లితో పాటు పలు కేంద్రాల్లో ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇళ్లు, ఇళ్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ లు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతాయి. ప్లాట్లు, ఇళ్లు కొన్న వారు రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకుంటారు. నిబంధనల ప్రకారం తగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తారు. స్లాట్ బుక్ చేసిన తేదీల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లతో కార్యాలయానికి వెళితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. నిబంధనలకు అనుగుణంగా డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్లను వారికి అందించాలి. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పద్దతిన రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
డాక్యుమెంట్లు లేవని కొర్రీలు..
డాక్యుమెంట్ రైటర్స్ విధానాన్ని తీసివేసి ఆన్ లైన్ పద్దతిని పెట్టి దాదాపు పదేళ్లు దగ్గర పడుతున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ వ్యవస్థ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికీ డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు, మధ్యవర్తులు లేనిదే ఏ రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చూసిన వీరే దర్శనం ఇస్తున్నారు. భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని వెళ్లిన పరిస్థితి మాత్రం అనుకూలంగా ఉండటం లేదు. నేరుగా వెళ్లిన వారికి ఏవో ఒక కారణాలు చెప్పి డాక్యుమెంట్లు లేవని కొర్రీలు పెడుతున్నారు. వారిని తిప్పి పంపిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు, మధ్యవర్థుల ద్వారా వెళ్లిన వారికి మాత్రం ఏమీ పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పనులన్నీ వీరి ద్వారానే కొనసాగుతున్నాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు పెట్టిన ఇప్పటికీ ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చూసినా దాని చుట్టుపక్కల బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్ల కార్యాలయాల్లే ఉంటున్నాయి. వారే రిజిస్ట్రేషన్ కు వచ్చే వారికి సంబంధించిన అన్ని వివరాలను తీసుకోవడంతో పాటు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేస్తున్నారు.
పత్రాలు తీసుకొని వెళ్లి రిజస్ట్రేషన్లు చేపిస్తున్నారు. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను తీసుకొని వచ్చి వారికి అప్పచెబుతున్నారు. ప్రతీ డాక్యుమెంట్ కు వేల రూపాలయ ఫీజులను వసూలు చేస్తున్నారు. ఆన్ లైన్ ఫీజులే కాకుండా ఒకొక్క డాక్యుమెంట్, దాని వాల్యును బట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ఏవైనా లిటిగేషన్ ఉన్న ప్లాట్లు, ఇళ్లు ఉంటే వాటికి వేల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని నాలా కన్వర్షన్ లేని ప్లాట్లు, అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించిన ప్లాట్లను కూడా ఎలాంటి పరిశీలన లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమైనా కొన్ని లొసుగుల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇవే కాకుండా పలు రకాల డాక్యుమెంట్లకు ధరలు కట్టి డబ్బులు తీసుకుంటున్నారు. డాక్యుమెంట్లకు సంబంధించి రైటర్లు ఏ డాక్యుమెంట్ పైనైనా రైటర్లు, ఏజెంట్లు, మధ్యవర్థుల ద్వారా వచ్చేవాటికి ప్రత్యేకమైన కోడ్ ఇస్తున్నారు. పెన్సిల్ లేదా కలర్ పెన్నులతో పైన టిక్కులు కొడుతున్నారు. దానికి అనుగుణంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యనే ఇంచార్జిలు ఉన్న చోట ఎలాంటి డాక్యుమెంట్లు పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సబ్ రిజిస్ట్రార్ లేని సమయంలో ఇంచార్జిగా ఉన్నఅధికారి నాలా కన్వర్షన్ లేకుండానే 21 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేశారు.
వీటికి సంబంధించి డబ్బులు కూడా భారీగానే చేతులు మారాయి. ఇది వివాదాస్పదం కావడంతో సంబంధిత ఉద్యోగిని వేరే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించారు. వరంగల్, హన్మకొండతో పాటు ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్ని విభాగాల్లోనూ మధ్యవర్థులు, డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్ల ద్వారానే పనులు చేస్తున్నట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్లతో పాటు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు కూడా వారి చేతుల్లోనే ఉండటంతో ఆ విషయాలను కూడా పరిశీలించి ఉన్నతాధికారులకు చేరవేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారానే ఎక్కువగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. గతంలో చాలా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలను ఏసీబీ అధికారులు చేపట్టారు. అయినా ఇప్పటికి మాత్రం ప్రైవేటు వ్యక్తుల తగ్గడం లేదు. డాక్యుమెంట్లు అన్నీ వారి ద్వారానే రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు ఏసీబీ అధికారుల నివేదికలో పేర్కొన్నారు. ఆన్ లైన్ విధానం కార్యాలయాల్లోనూ ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కొంత మంది అధికారులపైన కూడా చర్యలు చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులు భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం తనిఖీలు చేపట్టగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ పెట్టిన రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రం అదనపు ఖర్చు తప్పడం లేదు. ప్రభుత్వం ఏ పద్ధతి తెచ్చిన తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ వ్యవస్థ వల్ల సామాన్యులు సైతం వేల రూపాయలు ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఈ కార్యాలయాల్లో లేదు.






