ఆయన వల్లే మంత్రి స్థాయికి ఎదిగా - మంత్రి కొండా సురేఖ

by velandi.Saikiran |   (  Updated:2025-08-20 14:58:28  IST  )

రాజీవ్ స్థానిక సంస్థ‌ల్లో ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల వల్లనే తాను ఈనాడు మంత్రి స్థాయికి ఎదిగాన‌ని కొండా సురేఖ పేర్కొన్నారు.

ఆయన వల్లే మంత్రి స్థాయికి ఎదిగా - మంత్రి కొండా సురేఖ
X

దిశ, వ‌రంగ‌ల్ బ్యూరో: మాజీ ప్ర‌ధానమంత్రి రాజీవ్ గాంధీ నాడు స్థానిక సంస్థ‌ల్లో ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల వల్లనే తాను ఈనాడు మంత్రి స్థాయికి ఎదిగాన‌ని... రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆయ‌న ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ వ‌ల్ల‌నే తాను లీడ‌ర్ గా నిలిచాన‌ని అన్నారు. రాజీవ్ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా బుధవారం వరంగల్ ఎంజీఎం సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ అని... ఆయ‌న ఈ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలర్పించారని మంత్రి కొండా సురేఖ కొనియాడారు.

దేశంలో పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశార‌ని పేర్కొన్నారు. దేశంలో 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడ‌న్నారు. కంప్యూటరును దేశానికి పరిచయం చేసిన మహనీయుడ‌న్నారు. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు.

రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడింద‌న్నారు. రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా,సామాజికంగా త‌మ నాయ‌కుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ముందుకు తీసుకెళుతున్న‌మన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామ‌న్నారు. రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాల‌ని మంత్రి సురేఖ సూచించారు.

Next Story