మేడారం జాతరకు ప్రగతిరథ చక్రాలు రెడీ

by velandi.Saikiran |

మేడారం జాతరకు ప్రగతిరథ చక్రాలు రెడీ
X

రైట్​రైట్..

=మేడారం జాతరకు ప్రగతిరథ చక్రాలు రెడీ

=భక్తుల తరలింపునకు సన్నద్ధమైన ఆర్టీసీ

=వరంగల్ నుంచి 4వేల బస్సులు

=ఉమ్మడి జిల్లాలోని 9డిపోలనుంచి ప్రత్యేక పాయింట్లు

=ఇతర జిల్లాల నుంచి సైతం ఆర్టీసీ సేవలు

=ముందుగానే ఏర్పాట్లు చేస్తున్న వరంగల్ రీజియన్ అధికారులు

=మేడారంలో 28 ఎకరాల్లో బస్టేషన్​ ఏర్పాటు

దిశ, వరంగల్ బ్యూరో : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ ఆర్టీసీ రీజియన్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి వివిధ రూట్లలో జాతర కోసం 4 వేల బస్సులను నడిపేందుకు ఏర్పాట్లను చేస్తూన్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి బస్సులను జాతర కోసం నడిపించనున్నారు. ఈ మేరకు కండక్టర్లు, డ్రైవర్లతో పాటు ఇతర సిబ్బందిని సమకూర్చుకుంటున్నారు. జాతరకు లక్షలాది మంది తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

9 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు..

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 28 నుంచి 31 వరకు జరుగనుంది. జాతరకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. జాతరకు వారం రోజుల ముందు నుంచే ఆర్టీసీ బస్సులను మొదలుపెట్టి జాతర ప్రారంభం వరకు సర్వీసులు పెంచేనుందుకు సిద్ధమవుతున్నారు. భక్తుల కోసం వరంగల్ రీజియన్ ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 9 డిపోల నుంచి ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేసి 4వేల బస్సులను నడిపేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జాతర సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వరంగల్ నగరం పరిధిలోని కాజీపేట, హన్మకొండ, వరంగల్ పరిధిలో పలు కేంద్రాల నుంచి జాతరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జనగామ, పరకాల, నర్సంపేట, తొర్రూర్, మహబూబాబాద్ డిపోల పరిధి నుంచి ఎక్కువ మొత్తంలో బస్సులు నడిపించనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబాబ్ నగర్ ఆర్టీసీ రీజియన్ల నుంచి బస్సులను వరంగల్ కు తరలించి ఇక్కడి నుంచి నడిపించనున్నారు. ఇవే కాకుండా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి బస్సులను నడిపే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. మేడారం జాతర వద్ద ప్రత్యేక బస్టేషన్ ను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది ప్రయాణికులను అక్కడికి తరలించడంతో పాటు మళ్లీ వరంగల్ కు వచ్చే విధంగా బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర పరిసర ప్రాంతాల్లోనే 28ఎకరాల్లో బస్టేషన్ ను ఏర్పాటు చేశారు. వరంగల్ రీజియన్ పరిధిలో జాతర కోసం ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లను చేసిందని ఆర్ఎం విజయభాను తెలిపారు. రీజియన్ నుంచి 4వేల బస్సులను నడుపుతామన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా జాతరకు బస్సులు వస్తాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు

Next Story