- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ పోరుకు సై..గెలుపు గుర్రాలకే పార్టీల జై!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలపైనే దృష్టి సారించాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలపైనే దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు వార్డుల వారీగా బలబలాలను బేరీజు వేసుకుంటూ గెలిచే అవకాశం ఉన్న నేతలకే టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను ఇంచార్జిలుగా నియమించింది. సీనియారిటీ కంటే సర్వే నివేదికల ఆధారంగా ప్రజాదరణ ఉన్నవారికే టిక్కెట్లు కేటాయించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాత స్థానాలను నిలబెట్టుకునేందుకు గట్టి కసరత్తు చేస్తోంది. బీజేపీతోపాటు వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతుండడంతో ఈసారి మున్సిపల్ పోరు రసవత్తరంగా మారనుంది.
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోరు మొదలవుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీల చూపు గెలుపు గుర్రాలపైనే ఉంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతలు వార్డుల వారీగా బలం, బలగం, సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని బలమైన నేతలను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. మెజార్టీ వార్డుల్లో గట్టి పట్టున్న నేతలకే టిక్కెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పోరు కోసం ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే తమ పార్టీ నేతలను కలుస్తూ దరఖాస్తులు సమర్పించుకుంటున్నారు.
షెడ్యూల్ విడుదలకు ముందే రంగం సిద్ధం
ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. భూపాలపల్లి, పరకాల, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, మరిపెడ, వర్ధన్నపేట, తొర్రూరు, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కానుండటంతో ఆశావాహులు రిజర్వేషన్లకు అనుగుణంగా తమ వార్డుల్లో ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో నాయకులు తమకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించనున్న ఇంచార్జి మంత్రులు
ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఇద్దరు మంత్రులను ఇంచార్జిలుగా నియమించింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బాధ్యులుగా నియమించింది. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. సీనియారిటీ కంటే సర్వే నివేదికల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
బీఆర్ఎస్, బీజేపీల ధీటైన వ్యూహాలు
కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. పాత స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు కొత్తగా యువతకు, బలమైన నేతలకు అవకాశం ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. అటు బీజేపీ కూడా పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమై ఏర్పాట్లలో నిమగ్నమైంది. వామపక్ష పార్టీలు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ దఫా ఎన్నికల పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.






