కొబ్బరి బొండాల ముసుగులో గంజాయి స్మగ్లింగ్.. ముగ్గురి అరెస్ట్

by Disha Web Desk 11 |
కొబ్బరి బొండాల ముసుగులో గంజాయి స్మగ్లింగ్.. ముగ్గురి అరెస్ట్
X

దిశ, హన్మకొండ: ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వరంగల్ కు అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను ప్రత్యేక నిఘాతో టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 60 వేల విలువ గల 3 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, స్కూటీని (ద్విచక్రవాహనం) స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాకు వివరాలు తెలిపారు. ఎండు గంజాయి రవాణా, విక్రయాలు సరఫరా గురించి విశ్వసనీయ సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం. జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు సిబ్బంది, మిల్స్‌కాలనీ పోలీసులను ఆదేశించడం జరిగిందన్నారు.

ఖిలా వరంగల్ రాతి కోట దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహించగా ఖమ్మం పాటి సుమంత్, పాకాల సాయికుమార్, ములుగు వికాస్ విక్కీ వద్ద నుండి 3 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురిని విచారించగా ఖమ్మం పాటి సుమంత్ వరంగల్ లోని శివనగర్ వాసి. ఇతని పై గతంలో అనేక కేసులు ఉన్నాయి. వృత్తి రీత్యా కరీంనగర్ లో ఉంటూ కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ ఎవరికి అనుమానం రాకుండా గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడేవాడు. గంజాయి కొనుగులు చేసేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరే ముందు తనకు పాత స్నేహితులైన పాకాల సాయి కుమార్, ములుగు వికాస్ లకి సమాచారం తెలియజేసి ముగ్గురు కలిసి వరంగల్ నుంచి మహబూబాబాద్, భద్రాచలం మీదుగా కలిమెల ఒరిస్సాకి స్కూటీ మీద చేరుకొని అక్కడ మొద్దుభాయి దగ్గర గంజాయి కొనుగులు చేసి తిరిగి వరంగల్ కి చేరుకొనే వారు.

100 గ్రాముల గంజాయిని పాకెట్ ల రూపంలో అవసరమైన వారికి రూపాయలు 500, 700,1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకొనే వారు. అమ్మడానికి సులువుగా ఉండే ప్రాంతాలైన వరంగల్, శివనగర్, కాశీబుగ్గ, కరీమాబాద్, ఖిల్లావరంగల్, చింతల్, లేబర్ కాలనీ ప్రాంతాలన్నీ ఎంచుకుని విక్రయాలు జరిపేవారు. ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి సప్లైని పెంచుటకు స్కూల్, కాలేజ్ విద్యార్థులకు గంజాయి తాగడం అలవాటు చేసి వారిలో కొందరిని గంజాయి ప్యాకెట్లను విక్రయించడానికి ఉపయోగించుకుంటూ గంజాయి అక్రమ రవాణాలను విస్తరించుకుంటూ పోతున్నారు. ఇప్పటివరకు 15మంది గంజాయి విక్రయించే వారిని, 50 మంది గంజాయిని సేవించే వారిని గుర్తించడం జరిగిందన్నారు.

వీరిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. గంజాయి సంబంధిత ఉత్పత్తులు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గంజాయి రహిత కమిషనరేట్ గా చేయడమే లక్ష్యం అని తెలిపారు. తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టి విపరీత ధోరణి, వారి ప్రవర్తన గమనించి మాదకద్రవ్యాలు వినియోగించినట్లైతే పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్బంగా కోరారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సీపీ అభినందించారు.


Next Story