షర్మిల 'ప్రజాప్రస్థానం' పునఃప్రారంభం..15 షరతులతో కూడిన అనుమతి

by Hajipasha |

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభానికి వరంగల్ పోలీసులు అనుమతి ఇచ్చారు.

షర్మిల ప్రజాప్రస్థానం పునఃప్రారంభం..15 షరతులతో కూడిన అనుమతి
X

దిశ, హనుమకొండ టౌన్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభానికి వరంగల్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా ఫిబ్రవరి 2 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు 15 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పోలీస్ శాఖ ఇచ్చిన అనుమతి మేరకు రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను ఫిబ్రవరి 2 నుంచే కొనసాగించాలని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించారు. పాదయాత్ర ఆగిన చోట అంటే నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా నుంచే పాదయాత్ర మొదలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి అవ్వగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన 8 నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వేస్ట్, స్టేషన్ ఘనపూర్, జనగాం, పాలకుర్తి, మహబూబాబాద్ మీదుగా పాలేరు నియోజకవర్గంలో మరోసారి అడుగు పెట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది.

ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3512 కి. మీ పూర్తి కాగా.. 4 వేల కి. మీ పూర్తి చేసేందుకు 25 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ముగింపు సభ పాలేరు నియోజకవర్గంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. అయితే ఎవరి పాదయాత్రకు లేని షరతులు తమ పాదయాత్రకు పెట్టడం పై వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఅర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పాదయాత్ర కేసీఅర్ పాలనకు అంతిమయాత్రని, అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కేసీఅర్‌కు భయం పట్టుకుందని అన్నారు. పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే కేసీఅర్‌కు చమటలు పడుతున్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నరని, అందుకే 15 కండిషన్లు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే తమ కర్తవ్యమని వైఎస్ షర్మిల అన్నారు.

Next Story