వావ్..మిస్ట్ బస్టాప్

by Ratna Kumari |

ప్రజలకు మండు వేసవి బారీ నుండి ఉపశమనం కల్పించే విధంగా హనుమకొండ నగరంలో రెండు మిస్ట్ బస్టాప్ లను ఏర్పాటు చేశారు.

వావ్..మిస్ట్ బస్టాప్
X
దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ప్రజలకు మండు వేసవి బారీ నుండి ఉపశమనం కల్పించే విధంగా హనుమకొండ నగరంలో రెండు మిస్ట్ బస్టాప్ లను ఏర్పాటు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం ప్రారంభించారు.రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ప్రప్రథమంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రధాన గేట్ పక్కన, పెట్రోల్ పంప్ పబ్లిక్ గార్డెన్ దగ్గర మిస్ట్ బస్టాప్ లను ఎమ్మెల్యే, కలెక్టర్ లు లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం బస్టాప్ లలో ఎమ్మెల్యే, కలెక్టర్, ప్రజలతో కలిసి కూర్చున్నారు. మిస్ట్ బస్టాప్ లలో మండు వేసవిలోనూ ప్రజల సౌకర్యార్థం చల్లగా ఉండేలా తీర్చిదిద్దారు. అందంగా తయారు చేసిన మిస్ట్ బస్టాప్ లలో ప్రజలు ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేలా పై కప్పు నుండి సన్నటి నీటి తుంపరలు చల్లగా ఉంచుతాయి. వేసవి దృష్ట్యా వడగాలులు వీస్తుండగా వాటి నుండి రక్షణగా ఈ మిస్ట్ బస్టాప్ లలో చల్లధనానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి.

మిస్ట్ బస్టాప్ లలో పైన ఉన్న వెదురు తడకలపై నుండి ప్రత్యేకంగా మోటార్ల ద్వారా పైపుల ద్వారా చిన్నచిన్న నీటి తుంపరలు పడుతుంటాయి. దీంతో బస్టాప్ లో ఉన్న ప్రజలకు శీతల వాతావరణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరానికి వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని, బస్సులలో వెళ్లేందుకు వేచి చూస్తుంటారని ప్రజల ఆరోగ్యం, భద్రత, ప్రయాణ సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మిస్ట్ బస్టాప్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మిస్ట్ బస్టాప్ లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మిస్ట్ బస్టాప్ లలో చల్లని వాతావరణం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పలువురు యువకులు, మహిళలు మాట్లాడుతూ వేసవిలో ఎండలు మండుతున్నాయని, ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పిస్తూ చల్లగా ఉండేవిధంగా కొత్తగా బస్టాప్ లను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండీ. అజీజ్ ఖాన్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రవికుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story