- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో విడత ప్రశాంతం..వారికే లీడ్ !
ఉమ్మడి జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి

రెండో విడత ప్రశాంతం
=ఉమ్మడి జిల్లాలో ఓటెత్తిన పల్లెలు
= ముగిసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
=ఆరు జిల్లాల పరిధిలో భారీగా జరిగిన పోలింగ్
=ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
=పోలింగ్ అనంతరం కౌంటింగ్.. ఫలితాలను ప్రకటించిన అధికారులు
=పంచాయతీల్లో గెలుపు, ఓటమిపై సమీక్షించుకుంటున్న అభ్యర్థులు
దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించారు. ఏకగ్రీవ పంచాయతీలు పోను మిగిలిన 508 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో వార్డు, సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ఇళ్లు ఇళ్లు తిరగడంతో పాటు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చే విధంగా ప్రయత్నాలు చేశారు. కొన్ని గ్రామాల పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులు వృద్ధుల కోసం వాహనాలను కూడా సమకూర్చారు. వృద్ధులు, వికలాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లను అందుబాటులో ఉంచారు. అన్ని మండలాల్లో ఒక్కటి నుంచి రెండు వరకు గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ పూర్తి కాగా 2గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టారు. మొదట వార్డు అభ్యర్థుల ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచులు ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
భారీగా నమోదైన పోలింగ్..
ఉమ్మడి జిల్లాలో రెండవ విడత కూడా పోలింగ్ భారీగా జరిగింది. వరంగల్ జిల్లా పరిధిలో 77.66 శాతం పోలింగ్ నమోదైంది. దుగ్గండిలో 64.24, గీసుగొండలో 84.16, నల్లబెల్లిలో 89.6, సంగెంలో 76.43 శాతం పోలింగ్ నమోదైంది. భూపాలపల్లి జిల్లా పరిధిలో 84.14 శాతం పోలింగ్ జరిగింది. భూపాలపల్లిలో 82.64, చిట్యాల్ లో 83.86, తలిమెడలో 86.4, టేకుమట్లలో 86.16 శాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 82.24 శాతం పోలింగ్ నమోదైంది. బయ్యారంలో 69.67, చిన్నగూడూరులో 86.75, దంతాల పల్లిలో 88.15, గార్లలో 82.06, నర్సింహులపేట 87.81, పెద్దవంగర 85.88, తొర్రూరులో 83.34 శాతం నమోదైంది. జనగామ జిల్లాలో 81.20 శాతం పోలింగ్ జరిగింది. బచ్చన్నపేటలో 70.3, జనగామలో 88.53, నర్మెట్టలో 87.28, తరిగొప్పులలో 88.48 శాతం నమోదైంది. ములుగు జిల్లాలో మొత్తం 81.53 శాతం పోలింగ్ జరిగింది. మల్లంపల్లిలో 84.50, ములుగులో 78.81, వెంకటాపూర్ లో 82.51 శాతం నమోదైంది. హన్మకొండ జిల్లా పరిధిలోని 87.25 శాతం పోలింగ్ జరిగింది. ధర్మసాగర్ 85.85, హసన్పర్తి 87.90, వేలేరు 86.97, పరకాల 86.90, ఐనవోలు 88.61 పోలింగ్ నమోదైంది. రెండవ విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆరు జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పలుసూచనలు చేశారు.
అభ్యర్థులకు భారీగా ఖర్చు..
అభ్యర్థులు భారీగా ఓట్ల కోసం భారీగా ఖర్చు పెట్టారు. మద్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశారు. కొన్ని గ్రామాల పరిధిలో ఓటుకు రూ.2వేలు, మటన్, చికెన్ సరఫరా చేశారు. ఖర్చు పెట్టినా కొంత మంది ఓడిపోవడంతో పోలింగ్ ఆధారంగా అనాలసిస్ చేసుకుంటున్నారు. ఎక్కడా ఓట్లు తగ్గాయో అంచనాకు వస్తున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రచారం చేసిన వారు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోయారు. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. రెండవ విడత అభ్యర్థులు మొదటి విడత కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులను ఖర్చు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఉత్సాహం...
గ్రామ పంచాయతీ మొదటి, రెండవ విడతల్లో ఆశించిన ఫలితాలు రావడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లో జోష్ పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో తాము మద్దతు అభ్యర్థులు గెలుపొందడంతో రెండు పార్టీల నేతల్లో ఊపు కనిపిస్తుంది. మూడవ విడతకు ఇంకా ఒక్కరోజే ప్రచార సమయం ముగియనుండటంతో రెట్టింపు ఉత్సాహంతో పార్టీ నేతలు పనిచేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫలితాలు ఉండనుండటంతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.






