- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక మాఫియాకు ఇందిరమ్మ వరం
ఇందిరమ్మ ఇళ్ల ఇసుక సదుపాయాన్ని ఆసరాగా చేసుకుని ఇసుక మాఫియా భారీగా అక్రమ డంపులు ఏర్పాటు చేస్తోంది.

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం కల్పించిన ఇసుక రవాణా సదుపాయం కొందరు అక్రమార్కులకు వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో జిల్లాలోని మరిపెడ,నెల్లికుదురు, నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల్లో అక్రమ రవాణాకు కొంత మేర అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం పెరగడంతో మళ్లీ అక్రమ రవాణా జోరందుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇసుక రీచ్‌ల నుంచి బయలుదేరే ప్రతి ట్రాక్టర్‌కు సంబంధించిన అనుమతులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ఇసుక నిజంగా లబ్ధిదారుల ఇళ్లకే చేరుతోందో లేదో నిర్ధారించాల్సి ఉంది.
కానీ క్షేత్రస్థాయిలో ఆ పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు ట్రాక్టర్ల అనుమతులను సక్రమంగా స్కాన్ చేయకుండా ట్రిప్పుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో అనుమతులు లేని వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇసుక తరలింపునకు ప్రభుత్వం నెల రోజుల గడువు ఇవ్వడం కూడా అక్రమ రవాణాదారులకు అనుకూలంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో నరసింహులపేట, నెల్లికుదురు, మరిపెడ, చిన్నగూడూరు, కురవి, మహబూబాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం అందిస్తున్న ఈ సదుపాయం లక్ష్యానికి విరుద్ధంగా అక్రమాలకు వేదిక కాకుండా ఉండాలంటే సంబంధిత శాఖలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమతుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే అక్రమ రవాణాకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కడ చూసినా..ఇసుక కుప్పలే..!
సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలతో లబ్ధిదారుల ఇళ్లకు తక్కువ ఖర్చుతో చేరాల్సిన ఇసుక మధ్యలోనే మళ్లింపునకు గురవుతూ భారీ డంపులుగా మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిపెడ మండలం మూలమర్రి తండా, తానంచర్ల, నర్సింహులపేట మండలం జయపురం, కౌసల్యాదేవి పల్లి నుంచి ప్రారంభమై చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి, కొత్తూరు మీదుగా నేరడ క్రాస్‌రోడ్, పర్వతగిరి, శనిగపురం తదితర ప్రాంతాల్లో చెట్ల గుట్టలు, ఖాళీ స్థలాల మాటున వేలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఇసుక డంపులపై సంబంధిత శాఖల అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందినప్పటికీ, వాటిని స్వాధీనం చేసుకోవడం కానీ, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం గానీ జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అక్రమ ఇసుక నిల్వలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇసుక అక్రమ రవాణా వెనుక అధికారుల మౌనమే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాక ఇసుక తరలింపు ఆత్రుత లో తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
ప్రభుత్వ విప్ రాజీనామా చేయాలి: ఎల్‌హెచ్‌పీఎస్
డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ చెక్ డ్యాముల పునరుద్ధరణ విషయంలో విఫలమయ్యారని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆంగోత్ చందులాల్ విమర్శించారు. ఆకేరు వాగుపై ఉన్న చిన్నగూడూరు–ఉగ్గంపల్లి, చిన్నగూడూరు–విసంపల్లి చెక్‌డ్యాములు తెగిపోయి సంవత్సరాలు గడిచినా మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెక్‌డ్యాములు దెబ్బతిన్న ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ప్రత్యేక నిధులు మంజూరు చేసి చెక్‌డ్యాములను పునరుద్ధరించాలని, లేకపోతే ప్రభుత్వ విప్ తన పదవికి రాజీనామా చేయాలని చందులాల్ డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సకాలంలో చేరేలా స్థానిక తహసీల్దార్ లు చర్యలు తీసుకోవాలని పక్కదారి పట్టే ఇసుక పై నిఘా పెట్టడంతో పాటు అక్రమ ఇసుక డంపులను వెంటనే సీజ్ చేయాలి. విధులల్లో నిర్లక్ష్యం వహించే అధికారుల పై చర్యలు తప్పవని తొర్రూర్ ఆర్డీవో గణేష్ హెచ్చరించారు.- తొర్రూర్ ఆర్డీవో గణేష్ .!






