ప్రజా సమస్యల పరిష్కారానికి 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
X

దిశ, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ లోని ఐ.డీ.ఓ.సీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సేవల మెరుగుదలపై దృష్టి సారించాలని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను వెంటనే తీర్చాలని మంత్రి ఆదేశించారు. మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన సిబ్బందిని నియమించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉపయోగంలో లేని వైద్య పరికరాలను తొలగించి, అవసరమైన పరికరాలను సిబ్బంది సహాయంతో సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అంబులెన్స్ లేని చోట ప్రతిపాదనలు పంపాలన్నారు.

పాఠశాల వాహనాలపై కఠిన చర్యలు

పాఠశాలలకు సంబంధించిన వాహనాలు ఫిట్‌నెస్ లేకుండా నడిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. జీపీఆర్‌ఎస్ సాంకేతికత ద్వారా పాఠశాల వాహనాలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే పనికిరాని పాత భవనాల వల్ల ప్రమాదాలు ఏర్పడతాయని వాటిని వెంటనే కూల్చాలన్నారు.

నారాయణపురం రైతులకు పట్టాలించేందుకు నేనే వస్తా మంత్రి పొంగులేటి.!

వందల ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న కేసముద్రం మండలం నారాయణపురం రైతులకు మంత్రి పొంగులేటి తీపి కబురు అందించారు.చాలా మంది అర్హులకు ఇప్పటివరకు పట్టాలందలేదని త్వరలోనే కలెక్టర్ డేట్ ఫిక్స్ చేస్తే తానే వచ్చి పట్టాలిస్తానని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. దీంతో నారాయణపురం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల‌ నిర్మాణం వేగవంతం

స్లమ్ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల‌ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. నిధుల సమస్యలు ఉన్నచోట వెంటనే నివేదికలు పంపాలని చెప్పారు. మార్చి నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ కాని ఇండ్లను లబ్ధిదారుల అంగీకారంతో రద్దు చేయాలని సూచించారు.అలాగే పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు బీహెచ్ కేల‌ను ఈ ప్రణాళికలోనే అర్హులైన వారికి పంచాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పాత ఇళ్లు కూల్చుకొని కొత్త ఇల్లు కట్టుకుంటే ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పొద్దంటూ సహకరించాలని కోరారు.

హాస్టళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ..

ప్రతి హాస్టల్‌కు ప్రత్యేక అధికారిని నియమించి తరచూ తనిఖీలు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని సూచించారు. విద్యార్థులకు మౌలిక వసతులు విషయంలో రాజీ పడొద్దు అన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాలి : మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దరఖాస్తుల స్థితి గురించి దరఖాస్తు దారులకు సమాచారం అందేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలని తెలిపారు. అదేవిధంగా బాలికల వసతి గృహాల్లో ఇన్సినరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో ఆరోగ్య సదస్సులు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మ‌న్ ల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలని సూచించారు.

మంచి ప్రయత్నమే స్వాగతిస్తున్నాం కానీ.. : ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు

99 రోజుల ప్రణాళికని తాను స్వాగతిస్తున్నానని.. కానీ పోలీస్ బ‌ల‌గాల‌తో అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్ల‌వ‌ద్దని ప్రజలకు కోపం వస్తే.. ఒక మాట అంటారని దాని అర్థం చేసుకొని ముందుకు వెళ్లితే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందన్నారు. యువతకు ఉపాధి ఎలా క‌ల్పించాల‌నేదానిపై దృష్టి పెట్టాలని , రోడ్డు యాక్సిడెంట్ల పై ఓ కమిటీ వేయాలన్నారు. కలెక్టర్ల దగ్గర పనుల ఆమోదం కోసం అధికారులను గంటలు గంటలుగా ఉంచవద్దని సూచించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ,ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్,ఎమ్మెల్సీ రవీందర్రావు,ఎమ్మెల్యేలు మురళి నాయక్, దొంతి మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు రేవురి ప్రకాష్ ,వరంగల్ మేయర్ గుండు సుధారాణి,ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story