మూడవ విడత పోలింగ్ ప్రశాంతం.. ఉమ్మడి జిల్లాలో పోటెత్తిన ఓటర్లు

by Ajay Maddhiboyina |

ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ మూడవ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికలు జరిగిన అన్ని గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

మూడవ విడత పోలింగ్ ప్రశాంతం.. ఉమ్మడి జిల్లాలో పోటెత్తిన ఓటర్లు
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ మూడవ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికలు జరిగిన అన్ని గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. చలి ఎక్కువగా ఉన్నా బారులుతీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, యువత, మహిళలు ఎక్కువ మొత్తంలో రాగా ఆరు గంటల్లో భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. అన్ని పంచాయతీల్లో ఉదయం 7గంటల నుంచే పోలింగ్ మొదలుకాగా ఓటర్లు మధ్యహ్నం 1గంట వరకు కూడా వచ్చి ఓటు వేశారు. అన్ని చోట్లా వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పోలింగ్​శాతం ఇలా..

హన్మకొండ జిల్లా పరిధిలో 4 మండలాల పరిధిలో జరిగిన మూడవ విడత ఎన్నికల్లో మొత్తం 86.44 శాతం పోలింగ్ జరిగింది. ఆత్మకూర్ లో 87.43 దామెరలో 89.55, నడికుడలో 85.00, సాయంపేటలో 84.74 శాతం పోలింగ్ జరిగింది.

వరంగల్ జిల్లాలో మొత్తం 77.58 శాతం పోలింగ్ జరిగింది. చెన్నరావుపేటలో 83.59, ఖానాపూర్ లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం నమోదైంది.

మహబూబాబాద్ జిల్లాలో 86.91 శాతం పోలింగ్ జరిగింది. గంగారంలో 84.83, దోర్నకల్ లో 89.79, కొత్తగూడలో 83.01, కురవిలో 86.78, మరిపెడలో 86.20, శిరోల్ లో 89.60 శాతం పోలింగ్ జరిగింది.

భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ మొత్తం 83.30 శాతం అయ్యింది. కాటరంలో 81.93, మహదేవ్ పూర్ లో 84.17, మహముత్తారంలో 85.37, మలహర్ రావులో 82.30 శాతం పోలింగ్ నమోదైంది.

జనగామ జిల్లాలో మొత్తం 83.27 శాతం పోలింగ్ నమోదైంది. దేవరుప్పులలో 87.64, కొడకండ్లలో 83.39, పాలకుర్తిలో 80.06 శాతం నమోదైంది.

ములుగు జిల్లాలో మూడు మండలాల పరిధిలో 82.56 శాతం పోలింగ్ నమోదైంది. కన్నాయిగూడెంలో 82.79 శాతం, వెంకటాపూర్ లో 81.07, వాజేడులో 84.39 శాతం పోలింగ్ నమోదైంది.

మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు భారీ ఏర్పాట్లను చేయడంతో పాటు పోలీసు బందోబస్తును చేయడంతో చెదురు ముదురు సంఘటనలు మినహా మూడవ విడత ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అధికారులు వార్డులు, సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపును చేపట్టారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మొదట వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించారు. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను ప్రకటించి గెలిచిన వారికి పత్రాలను అందజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story