- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే రేవూరి ఆగ్రహం
హనుమకొండ జిల్లా ఆత్మకూరు, దామెర మండలాల పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు, దామెర మండలాల పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమానికి లబ్ధిదారులు తరలివచ్చేలా సమన్వయం చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, నేను ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చాను. కానీ లబ్ధిదారులు ఆలస్యంగా రావడం నాకు నిరాశ కలిగించింది.
ఇది ప్రజల తప్పు కాదు, అధికారుల నిర్వాహక లోపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు అడిగితే నేరుగా చెప్పాలని ప్రజలకు సూచించారు. అలా డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పదేళ్ల నిరీక్షణకు తెర..
మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు రేషన్ కార్డులు మంజూరవలేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరీక్షణకు తెరపడిందని తెలిపారు. ఇప్పటివరకు ఆత్మకూరులో 428 మంది, దామెర మండలంలో 518 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పార్టీలకు అతీతంగా పథకాలను మంజూరు చేస్తున్నామని చెప్పారు. గతంలో రేషన్ కార్డులు లేక సంక్షేమ పథకాలు దూరమైనవారని, ఇకపై అర్హులకు అన్ని పథకాలు లభ్యమవుతాయన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించగా, ఆర్డీవో నారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్, సుధాకర్ రెడ్డి, రజనీకర్ గౌడ్, కక్కెర్ల రాజు, మాజీ సర్పంచులు పర్వతగిరి రాజు, కంచె రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మండల యువజన అధ్యక్షుడు తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.






