మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే

by velandi.Saikiran |

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే, కానీ బీఆర్ఎస్ చేసిన అప్పుల మాట ఏంటి అని ఫైర్ అయ్యారు నాయిని రాజేందర్ రెడ్డి

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే
X

దిశ, వరంగల్ బ్యూరో: మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే, కానీ బీఆర్ఎస్ చేసిన అప్పుల మాట ఏంటి అని ఫైర్ అయ్యారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బీఆర్ ఎస్‌ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, వర్ధన్నపేట శాసన సభ్యులు కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్‌ కా డోఖా పేరుతో కార్డులను విడుదల చేశారు.

అనంత‌రం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆరెస్ హయాంలో ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆగ్ర‌హించారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని, తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసిందన్నారు.

టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదని విమ‌ర్శ‌లు చేశారు. ఎరువులు, విత్తనాల కొరత – రైతు దైనందిన కష్టాలు టీఆర్‌ఎస్ పాలనలో పెరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోందన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం.... వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ వి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story