- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ రిజర్వేషన్ ఖరారు
ఉమ్మడి జిల్లా పరిధిలో మున్సిపల్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఒక నగర కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు మేయర్, చైర్మన్ల రిజర్వేషన్లు ప్రకటించారు.

మున్సిపల్ రిజర్వేషన్ ఖరారు
=మేయర్, చైర్మన్లతో పాటు వార్డుల రిజర్వేషన్ల ప్రకటన
= రిజర్వేషన్లకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహణ
= రిజర్వేషన్లపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ
= పోటీకి సిద్ధమవుతున్న పార్టీల నేతలు
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లా పరిధిలో మున్సిపల్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఒక నగర కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు మేయర్, చైర్మన్ల రిజర్వేషన్లు ప్రకటించారు. మున్సిపాలిటీలలో వార్డుల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో ముందుగానే రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ రిజర్వేషన్లకు అనుగుణంగానే ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో మేయర్, చైర్మన్ రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లను ప్రకటించారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీ ల రిజర్వేషన్లు ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను జనరల్ కింద రిజర్వు చేశారు. తొర్రూర్, వర్దన్నపేట, పరకాల మున్సిపాలిటీలను జనరల్ గా ప్రకటించగా మరిపెడ మున్సిపాలిటీని జనరల్ మహిళగా డిక్లర్ చేశారు.
జనగామ, భూపాలపల్లి మున్సిపాలిటీలను బీసీ జనరల్ కింద డిక్లర్ చేయగా ములుగు, నర్సంపేట మున్సిపాలిటీలను బీసీ మహిళకు కేటాయించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీని ఎస్టీ జనరల్ గా రిజర్వు చేయగా కేసముద్రం మున్సిపాలిటీని ఎస్టీ మహిళకు కేటాయించారు. స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్ మున్సిపాలిటీలను ఎస్సీ జనరల్ కు రిజర్వు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్ కార్పొరేషన్ తో కలిపి ఐదు మున్సిపాలిటీలను జనరల్ కేటాయించగా నాలుగు మున్సిపాలిటీలను బీసీకి, రెండు మున్సిపాలిటీలను ఎస్టీకి, రెండు మున్సిపాలిటీలను ఎస్సీ కి రిజర్వు చేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ఇంకా ఐదు నెలల పాటు ఉంది. అయినా ముందుగానే రిజర్వేషన్లను ఖరారు చేశారు. మిగతా 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో చేయగా వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్ల ను ప్రకటించారు.
సిద్ధమవుతున్న పార్టీల నేతలు
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీల నేతలకు క్లారిటీ వచ్చింది. వార్డులతో పాటు చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించడంతో పార్టీల నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. కొంతమంది రిజర్వేషన్లపై ఆశలు పెట్టుకోగా వారికి అనుకున్న వార్డులు కాక వేరే వార్డులలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు మున్సిపాలిటీ ల్లో చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ మిగలగా కొత్త వారికి రిజర్వేషన్ ఆధారంగా ఆశలు పెరిగాయి. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగనుండటంతో అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. తమకు అనుకూలం ఉన్న స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావించే మున్సిపల్ పోరుకు మాత్రం అన్ని పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. తమ ప్రాధాన్యత ఉండే విధంగా పోటీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలలో మున్సిపల్ పోరుపై నేతల్లో ఆసక్తి పెరిగింది.






