రెండవ విడత గ్రామ పంచాయతీల్లో మైక్​లు బంద్​

by velandi.Saikiran |   (  Updated:2025-12-12 22:31:04  IST  )

రెండవ విడత ప్రచారం ముగియడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 14న పోలింగ్ ఉండటంతో అన్ని ఏర్పాట్లను చేశారు. ఎ

రెండవ విడత గ్రామ పంచాయతీల్లో మైక్​లు బంద్​
X

ముగిసిన ప్రచారం

=రెండవ విడత గ్రామ పంచాయతీల్లో మైక్​లు బంద్​

=గెలుపు కోసం మద్యం, డబ్బు పంపిణీపై అభ్యర్థుల దృష్టి

= మొదటి విడత ఫలితాలతో పార్టీల బేరీజు

= రెండవ విడతపై నజర్ పెట్టిన కాంగ్రెస్, బీజేపీ నేతలు

= పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో రెండవ విడత పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచారానికి తెరపడింది. సర్పంచ్, వార్డు కోసం నామినేషన్ వేసిన అభ్యర్థులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో గ్రామాల్లో గల్లీగల్లీ తిరిగి ఓటరును ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొదటి విడత ఊపుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మొదటి విడత లాగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

ఓటుకు నోటుపై దృష్టి..

ఉమ్మడి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచారం ముగిసింది. ఓటరు మద్దతు కూడగడుతూ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. ఒకే రోజు గడువు ఉండటంతో మద్యం, డబ్బు భారీగా ఖర్చు పెడుతున్నారు. మొదటి విడత అభ్యర్థుల కంటే రెండవ విడతలో ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఉన్న ఒకరోజులో డబ్బుతో ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో మద్యంతో పాటు మటన్, చికెన్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వెచ్చిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పలు హామీలు ఇస్తూనే కుల సంఘాలకు లక్షలు ముట్టజెప్పి వారి మద్దతుతో గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మొదటి విడత ఫలితాలతో రెట్టింపు ఉత్సాహం..

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ మంది సర్పంచులుగా గెలుపొందడంతో రెట్టింపు ఉత్సాహంతో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కావాల్సిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు గ్రామాల్లో తమ అనుచరులను నియమించి అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ పట్టు నిలుపుకోవడము కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ నేతలు సర్పంచ్ ఎన్నికలపై నజర్ పెట్టారు. తమ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏర్పాట్లలో అధికారులు..

రెండవ విడత ప్రచారం ముగియడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 14న పోలింగ్ ఉండటంతో అన్ని ఏర్పాట్లను చేశారు. ఎన్నికలు జరిగే మండలాల పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెట్టారు. ఆయా మండలాల పరిధిలో మద్యం అమ్మకాలను 44 గంటల పాటు నిలిపివేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో నజర్ పెట్టి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సిబ్బంది నేడు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ జరిగే గ్రామాలకు తరలివెళ్లే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు.

Next Story