గోల్డెన్ అవర్‌లో ప్రాణాలను కాపాడవచ్చు: కలెక్టర్

by Nallavelli.Anjaneyulu |

రోడ్డు ప్రమాదాల సమయంలో “గోల్డెన్ అవర్” ఎంతో కీలకమని, ఆ సమయంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

గోల్డెన్ అవర్‌లో ప్రాణాలను కాపాడవచ్చు: కలెక్టర్
X

దిశ, జనగామ : రోడ్డు ప్రమాదాల సమయంలో “గోల్డెన్ అవర్” ఎంతో కీలకమని, ఆ సమయంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ - అలైవ్” కార్యక్రమం నేపథ్యంలో శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో డ్రైవర్లకు గోల్డెన్ అవర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే భయపడి వెళ్లిపోకుండా బాధితులను రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, సమీప ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రాథమిక చికిత్స (CPR) అందించడం ద్వారా కూడా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసుల్లో భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని, ప్రమాదం చేసి పారిపోవడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే వారికి “రాహవీర్”, “పీఎం రాహత్” పథకాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ మాట్లాడుతూ… ప్రజలు సురక్షితంగా ప్రయాణించేందుకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చునేవారు కూడా హెల్మెట్ వినియోగించాలని సూచించారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని, తక్షణ సహాయం అందిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎయిడ్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు గోల్డెన్ అవర్‌లో సీపీఆర్ చేసే విధానం, 108 సేవల వినియోగంపై డ్రైవర్లకు ప్రదర్శన ద్వారా శిక్షణ ఇచ్చారు. అనంతరం డ్రైవర్లకు లైసెన్సులు పంపిణీ చేశారు.

Next Story