- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి వివాదాల్లో మహాబూబాబాద్ జేఎన్టీయూహెచ్ వ్యవహారం.!
పట్టణంలోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం మరోసారి వివాదాల్లోకి వచ్చింది.

దిశ, మహాబూబాబాద్ : పట్టణంలోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం మరోసారి వివాదాల్లోకి వచ్చింది. ప్రైవేట్ హాస్టల్ అద్దె బకాయిల కారణంగా ఇంటి యజమాని ఒక గదికి తాళం వేయడం కలకలం రేపింది. పట్టణంలోని గ్యాస్ గోదాం పరిసర ప్రాంతంలో కొంతమంది విద్యార్థులు ఓ భవనంలో ఉంటున్నారు. మొత్తం ఐదు పోర్షన్ల ఉన్న ఆ భవనంలో ఒక పోర్షన్ కు రెండేళ్లుగా అద్దె చెల్లించలేదని యజమాని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా జేఎన్టీయూహెచ్ యాజమాన్యం స్పందించడం లేదని యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అందులోని ఓ గదికి తాళం వేసిన కూడా స్పందించలేదని దీంతో గత్యంతరం లేక విద్యార్థులని కాళీ చెయ్యాలని చెప్పవలసి వచ్చిందని ఆ భవన యజమాని చెప్పుకొచ్చారు. ఇదే కాకుండా వేల రూపాయల కరెంట్ బిల్లు కూడా పెండింగ్‌లో ఉందని, అది కూడా చెల్లించడం లేదని చెప్పారు. “ఇలా అయితే మా కుటుంబం ఎలా గడవాలి?” అంటూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. చివరాఖరకు అద్దె బకాయి 15 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాళాలు తీయడం జరిగింది.
90 మంది విద్యార్థులు ఇబ్బందుల్లో..!
ఈ హాస్టల్‌లో సుమారు 90 మంది విద్యార్థులు ఉంటున్నట్టు సమాచారం. విద్యార్థులు ప్రతి నెల మెస్ ఫీజుగా రూ.1500, మెయింటెనెన్స్ పేరిట మరో రూ.1000 చెల్లిస్తున్నామని చెబుతున్నారు. “మేము చెల్లిస్తున్న డబ్బులు ఎటుపోతున్నాయి?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.ఫీజు రియంబర్స్మెంట్ /స్కాలర్షిప్ వచ్చినప్పుడు మీ ఖాతాలోనే పడతాయని కానీ మీరు తప్పక మెస్ మరియు మెయింటెనెన్స్ ఫీజు చెల్లించాల్సిందే అంటూ యాజమాన్యం మాపై ఒత్తిడి తెస్తుందంటూ వారు ఆరోపిస్తున్నారు. త్వరలోనే పరీక్షలు ఉండగా హాస్టల్‌కు తాళం వేయడంతో చదువుకు అంతరాయం కలుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మా భవిష్యత్తు మాకే అర్థం కావడం లేదు. ఏ ఒక్క అధికారి బాధ్యతగా స్పందించడం లేదు” అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
15 రోజుల్లో అద్దె బకాయిలు చెల్లిస్తామనీ హామీ.!
అద్దె చెల్లించాలంటూ చాలా రోజులుగా చెబుతున్నామని నెలరోజుల ముందుగానే హెచ్చరించిన మీరు ఎందుకు పట్టించుకోవడం చరవాణిలో ఆ భవన యజమాని ఓ అధికారి నీ నిలదీయడం జరిగింది. చివరాఖరుకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో అరగంటపాటు తాళం వేసిన తరువాత జేఎన్టీయూహెచ్ యాజమాన్యం నుంచి 15 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు యజమాని తెలిపారు.దీంతో తాళం తీయడం జరిగిందన్నారు.
అద్దె ఎవరు చెల్లించాలి?
ఈ ప్రైవేట్ హాస్టల్ అద్దెను ప్రభుత్వం చెల్లిస్తున్నదా? లేక విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల ద్వారా యాజమాన్యం చెల్లించాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై స్పష్టత లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
గత వివాదం మసకబారకముందే మరో ఘటన.!
గతవారం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో మట్టి పనులు చేయిస్తున్నారనే ఆరోపణలపై దిశ పత్రికలో వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ ఘటనపై సరైన విచారణ జరగలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ ఘటన పూర్తిగా చల్లారకముందే హాస్టల్ అద్దె వివాదం మళ్లీ వార్తల్లోకి రావడంతో జేఎన్టీయూహెచ్ పరువు దెబ్బతింటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమగ్ర విచారణకు డిమాండ్.!
ఈ వ్యవహారాలన్నింటిపైనా ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల ప్రతిష్ట దృష్ట్యా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా యాజమాన్యం అద్దె చెల్లించకపోవడంతో ఆర్థికంగా చితికి పోతున్నామని ఎన్ని సార్లు జేఎన్టీయూహెచ్ యాజమాన్యాన్ని సంప్రదించిన వారు స్పందించే తీరు సరిగ్గ లేదని ఇప్పటికైనా తనకు న్యాయంగా రావలసిన అద్దె మరియు పెండింగ్ కరెంట్ బిల్లు లనీ చెల్లించి తనకు సహాకరించాలని బాధిత భవన యజమాని మహామ్మద్ అన్వర్ కోరుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ వ్యవహారాలన్నింటిపై జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపల్ బలరాం నాయక్‌ను చరవాణిలో సంప్రదించగా వారు స్పందించలేదు.






