- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహజసంపద లూటీ.. యథేచ్ఛగా లారీల్లో తరలింపు..
ములుగు జిల్లా కాకతీయులు కట్టిన శిల్ప కట్టడాలతో పాటు సరస్సులకు నిలువైన ఈ ప్రాంతం సహజ వనరులకు పుట్టినిల్లుగా వెలిసింది.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లా కాకతీయులు కట్టిన శిల్ప కట్టడాలతో పాటు సరస్సులకు నిలువైన ఈ ప్రాంతం సహజ వనరులకు పుట్టినిల్లుగా వెలిసింది. జిల్లా సమీపం నుంచే గలగల పారుతున్న గోదావరి ప్రాంతంలో తరగని ఇసుక, ఎర్రమట్టి, రాయి, ఖనిజ సంపదకు నెలవుగామారింది. దట్టమైన అటవీ ప్రాంతం తో కూడిన ఈ ప్రాంతం నక్సల్స్ కు ఆయువుపట్టుగా ఉండగా 15ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంనుంచి వనరులు తరలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. నక్సల్స్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో బడా వ్యాపారులకు, రాజకీయ నాయకులకు సహజ సంపదను దోచుకోవడానికి అనువుగా మారింది. 9ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ నాయకులు సహజ వనరులను దోచుకుపోతున్నారంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆరోపించగా నేడు ఇసుక అక్రమ రవాణా మంత్రి సీతక్క అండదండలతో కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్న క్రమంలో జిల్లా రాజకీయ దుమారం నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నాయకులు పత్రిక సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం నేటికీ కొనసాగుతూనే ఉంది. గతంలో కేవలం వ్యాపారులు మాత్రమే ఇసుక దందా కొనసాగించగా పదేళ్లుగా రాజకీయ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన నాయకులు అక్రమంగా సహజ సంపదను తరలించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
దొందు దొందే అంటూ చిదరించుకుంటున్న జనం..
జిల్లాలోని సహజ వనరుల తరలింపు విషయంలో రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కోట్ల రూపాయల అక్రమ దందా కొనసాగించడంపై జిల్లా ప్రజలు చీదరించుకుంటున్నారు. ఆయా పార్టీల నాయకులు అక్రమంగా సంపాదన కోసం పోటీ పడటాని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే దోపిడి కొనసాగితే జిల్లాలో తిరిగి తిరుగుబాటు ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న ప్రమాదాలు..
ఇసుక రవాణాతో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక లారీల అధిక వేగం, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను నడుస్తున్న క్రమంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన సందర్భంలోనే పోలీసులు, ఆర్టీఏ అధికారులు హడావుడి చేయడం కొద్ది రోజులకే తిరిగి షరామామూలుగానే మారుతున్నది. దీంతో మనుషుల ప్రాణాలు పోవడమే కాకుండా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.
పట్టించుకోని మైనింగ్ అధికారులు..
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు అధికారులు అండగా ఉండడం సహజం. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా సహజ వనరులు తరలిపోతున్న క్రమంలో నిఘా పెట్టాల్సిన మైనింగ్ అధికారులు వాటిని పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు, కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రవాణాకు ఎలాంటి అవకాశం ఉండదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 1/70 యాక్ట్ కొనసాగుతున్నదా..?
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 యాక్ట్ కొనసాగుతున్నదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని వనరులు కేవలం గిరిజనులు మాత్రమే ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చనే నిబంధనలు అమలు అవుతున్నాయా అనే విషయం తెలియడం లేదు. సహజ వనరులను తరలింపుపై పెసా చట్టం ప్రకారం ముందస్తుగా ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పటికీ గిరిజనుల పేరుతో గిరిజనేతర్లు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు.






