పరకాలలో చల్లాకు నిరాశే.. ఆ నాయకుడికి టికెట్ ఇవ్వనున్న కేసీఆర్ ?

by Dishanational2 |
పరకాలలో చల్లాకు నిరాశే.. ఆ నాయకుడికి టికెట్ ఇవ్వనున్న కేసీఆర్ ?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ప‌ర‌కాల టీఆర్ ఎస్ టికెట్‌పై ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర రైతు విమోచ‌న క‌మిష‌న్ చైర్మన్‌ నాగుర్లకు లైన్ క్లియ‌ర్ అవుతోందా..? స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ నుంచే ఆయ‌న‌కు సంకేతాలందాయా..? కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను క‌లిసిన నాగుర్లకు కీల‌క నిర్ణయంపై మార్గనిర్దేశం చేశారా..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డిపై కూడా ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త నెల‌కొంద‌ని పీకే టీం స‌ర్వేల్లో తేలిన‌ట్లు స‌మాచారం. ప‌ర‌కాల ప‌ట్టణంలో, వ్యాపార వ‌ర్గాల నుంచి, ద‌ళిత సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల నుంచి తీవ్ర వ్యతిరేక‌త క‌లిగి ఉన్నట్లుగా కూడా అధిష్ఠానానికి నివేదిక చేరిన‌ట్లుగా టీఆర్ ఎస్ పార్టీలో ప్రచారం జ‌రుగుతోంది. ఈనేప‌థ్యంలో ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను కాద‌ని కొత్తవారికి అవ‌కాశం ఇచ్చే సీట్లలో ప‌ర‌కాల కూడా ఉంద‌ని పార్టీ ముఖ్య నేత‌ల ద్వారా తెలుస్తోంది.




ప్రత్యామ్నాయ ఆలోచ‌న‌ల్లో నాగుర్ల..

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డిపై తీవ్ర వ్యతిరేక‌త క‌లిగి ఉన్నట్లుగా పీకే టీం స‌ర్వేల్లో, పార్టీ అధినేత కేసీఆర్ చేయించిన స‌ర్వేల్లో కూడా తేలిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని కొంత‌మంది ముఖ్య నేత‌లు సైతం అంత‌రంగిక సంభాష‌ణ‌ల్లో అంగీక‌రిస్తున్నారు. ఈనేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చ‌ల్లాకు కాకుండా మ‌రోక‌రికి టికెట్ కేటాయించాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా పేర్కొంటున్నారు. ప‌ర‌కాల‌పై ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఆలోచ‌న‌ల్లో నాగుర్ల ఉన్నట్లుగా ధ్రువీక‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప‌ర‌కాల టికెట్‌పై ఇప్పటికే నాగుర్లకే విస్పష్టమైన హామీ ద‌క్కింద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈనేప‌థ్యంలోనే నాగుర్లను నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించేలా ప్రొత్సహిస్తున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. నాగుర్లకు ప‌ర‌కాల‌లో అవ‌కాశం ఇవ్వడం ద్వారా బీసీ సామాజిక వ‌ర్గానికి కూడా పెద్ద పీట వేసిన‌ట్లవుతుంద‌ని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప‌ర‌కాల ఎమ్మెల్యేల‌కు అనుకూలంగా, ద‌ళిత‌, బీసీ సామాజిక వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో నాగుర్ల ఎంపిక‌తో చెక్ పెట్టవ‌చ్చని కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు స‌మాచారం.

ఆత్మీయ పరామ‌ర్శల‌తో నాగుర్ల ప‌ర్యట‌న‌లు..

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ వాసియే అయిన నాగుర్ల వెంక‌టేశ్వర్లు ఆత్మీయ‌, ప‌రామ‌ర్శలతో ఆయా మండ‌లాల్లో విస్తృతంగా ప‌ర్యటిస్తున్నారు. ఆప‌ద‌లో ఉన్న ప్రజ‌ల‌ను, పార్టీ కార్యక‌ర్తల‌కు ఆర్థిక సాయం అంద‌జేస్తూ అండ‌గా నిల‌బ‌డుతున్నారు. అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న వారికి, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వ‌స్తున్న వారికి సాయం చేస్తూ వెళ్తున్నారు. అలాగే వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతూ సామాన్య జ‌నం అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి ఎవ‌రు , ఏ కార్యక్రమానికి పిలిచిన కాద‌న‌కుంటూ హాజ‌ర‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. గ‌డిచిన ఐదు నెల‌ల కాలంలోనే ఆయ‌న వంద‌లాది కార్యక్రమాలు హాజ‌రైన‌ట్లుగా ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తూ త‌న ప‌ట్టు నిలుపుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అనంత‌ర‌మే నాగుర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యట‌న‌లు ఎక్కువ‌గా చేస్తున్నట్లు కొంత‌మంది నేత‌లు గుర్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.





ఉద్య‌మం నుంచి పార్టీలోనే నాగుర్ల..

టీఆర్ ఎస్ పార్టీ నుంచి ప‌ర‌కాల టికెట్ ఆశిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ మ‌ధ్య‌లో ఆయ‌న పుట్టిన రోజు ఘ‌నంగా నిర్వ‌హించి తాను రేసులో ఉన్నాన‌నే విష‌యాన్ని ఇటు ఎమ్మెల్యేకు, అటు అధిష్ఠానానికి ఇండికేష‌న్ పంప‌డం గ‌మ‌నార్హం. ఉద్యమ కాలం నుంచి టీఆర్ ఎస్ పార్టీలో ప‌నిచేస్తున్న నాగుర్లకు వాస్తవానికి స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావం నుంచి పార్టీలో కొన‌సాగుతున్న అతికొద్దిమంది సీనియ‌ర్ నేత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు. రాజ‌కీయ అవ‌కాశాలు వ‌చ్చిన నిబ‌ద్ధత‌తో పార్టీ బ‌లోపేతానికి, ప‌లువురు ఎమ్మెల్యేల విజ‌యంలో భాగ‌స్వామ్యం అందిస్తూ వ‌చ్చారు. అయితే ప్రత్యక్ష రాజ‌కీయాల బ‌రిలో నిల‌వాల‌నే త‌లంపుతోనే కొన్ని కీల‌క ప‌ద‌వులను కూడా నాగుర్ల జార‌విడుచుకున్నట్లుగా ఆయ‌న స‌న్నిహితులు పేర్కొంటున్నారు. పార్టీనే ప‌ట్టుకుని ఏళ్లుగా ప‌నిచేస్తున్న నాగుర్లకు స‌రైన న్యాయం చేయ‌లేక‌పోయామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సైతం ఇటీవ‌ల జిల్లా నేత‌ల‌తో కూడా పేర్కొనడాన్ని పార్టీ ముఖ్య నేత‌లు గుర్తు చేస్తున్నారు. ప‌ర‌కాల టికెట్‌లోనే నాగుర్లకు అధినేత కేసీఆర్ న్యాయం చేస్తారా అన్నది వేచి చూడాలి.


Next Story

Most Viewed