రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు

by Disha Web Desk 23 |
రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు
X

దిశ,జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. అక్రమ లేఅవుట్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై, వీరికి సహకరిస్తున్న సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలంటూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలతోపాటు, పలు గ్రామాల్లో రైతుల వద్ద తక్కువ ధరలకు భూములు కొన్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లేఔట్ చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారని చెప్పారు. బోర్నపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 324 లో వ్యవసాయ భూముల్లో నాలా పర్మిషన్ లో తక్కువ భూమి చూపి ఎక్కువ ప్లాట్లు విక్రయిస్తున్నారని, వీరికి రెవెన్యూ అధికారులు సహకరించడంతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని ఆరోపించారు.

హుజురాబాద్-కరీంనగర్ హైవే రోడ్డు పక్కన గల సర్వే నంబర్ 2417,2418/1/2/3/4,2415,2416,2417 ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు వదిలిపెట్టడం లేదని, దళితులకు ప్రభుత్వ ఇచ్చిన భూములను దళితుల వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారికి ఉన్న అండదండలతో దళితులను బెదిరించి ఆ భూముల్లో అక్రమ లే-అవుట్లు చేసి విక్రయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 887, 629,865,431,368,389,92,93 సర్వే నంబర్లు ప్రభుత్వ భూములను, శిఖం భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ లేఅవుట్లు చేసి ప్లాట్లుగా విభజించి కోట్లు సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తున్న అధికారులతో పాటు అక్రమ లే-ఔట్లకు రిజిస్ట్రేషన్లు చేసిన హుజురాబాద్ సబ్ రిజిస్ట్రార్ పై సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.



Next Story

Most Viewed