ఈవీఎంలలో సింబల్ లోడింగ్, మెమొరీ బర్న్‌పై ఈసీకి ‘సుప్రీం’ ఆదేశాలు

by Dishanational4 |
ఈవీఎంలలో సింబల్ లోడింగ్, మెమొరీ బర్న్‌పై ఈసీకి  ‘సుప్రీం’ ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్‌లతో ముడిపడిన కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈవీఎంలలో నమోదయ్యే ఓట్లను వీవీ ప్యాట్‌ల నుంచి విడుదలయ్యే స్లిప్పులతో నూటికి నూరుశాతం సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులను వెలువరించింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించినట్లయింది.

పేపర్‌ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ మెషీన్‌

ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం.. అనవసర అనుమానాలకు దారి తీస్తుందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా వ్యాఖ్యానించారు. కౌంటింగ్‌ సమయంలో పేపర్‌ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ మెషీన్‌ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని ఈసీకి జస్టిస్‌ ఖన్నా తెలిపారు. ప్రతి పార్టీ గుర్తు పక్కన బార్‌కోడ్‌ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల ప్రొటోకాల్‌లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. పేపర్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

ఈసీకి రెండు కీలక ఆదేశాలు

ఈ తీర్పును ఇచ్చే సందర్భంగా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు రెండు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేసి, కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని సూచించింది. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చిన స్థానాలకు ఎన్నికల సంఘం ఇంజినీర్ల బృందం వెళ్లి.. మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియకు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తనిఖీల్లో ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే... ఖర్చులను సదరు అభ్యర్థికి తిరిగి ఇచ్చేయాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది.

వీవీప్యాట్‌ ఎందుకు ?

‘వీవీ ప్యాట్’ అంటే ‘ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌’. ఈవీఎం బటన్‌ను ఓటరు నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి స్క్రీన్‌పై 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. మనం అనుకున్న పార్టీకే ఓటు పడిందా లేదా అనే విషయం ఆ స్క్రీన్‌పై చూసుకోవాల్సి ఉంటుంది. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ అమలు చేసింది. ఆ తర్వాత విడతలవారీగా అన్ని రాష్ట్రాల్లో వాటిని వినియోగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రతీ అసెంబ్లీ స్థానం పరిధిలోని 5 ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్‌ చేయగా.. సుప్రీంకోర్టు అందుకు నో చెప్పింది.



Next Story

Most Viewed