ఏటూరు నాగారం గ్రామాన్ని బాల్య వివాహ ర‌హిత గ్రామంగా తీర్చిదిద్ద‌డం అంద‌రి బాధ్య‌త

by Ratna Kumari |

ఏటూరు నాగారం గ్రామాన్ని బాల్య వివాహ రహిత, బాలల స్నేహపూర్వక గ్రామంగా తీర్చిదిద్దడం మన అందరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత పేర్కొన్నారు.

ఏటూరు నాగారం గ్రామాన్ని బాల్య వివాహ ర‌హిత గ్రామంగా తీర్చిదిద్ద‌డం అంద‌రి బాధ్య‌త
X

దిశ, ఏటూరు నాగారం : ఏటూరు నాగారం గ్రామాన్ని బాల్య వివాహ రహిత, బాలల స్నేహపూర్వక గ్రామంగా తీర్చిదిద్దడం మన అందరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత పేర్కొన్నారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ బాల సభష‌ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పిల్లలకు చిన్నతనం నుంచే తమ హక్కుల పట్ల, ముఖ్యంగా సురక్షిత, అసురక్షిత స్పర్శ పట్ల అవగాహన ఉండాలని ఆమె సూచించారు. పిల్లలు దురలవాట్లకు లోనుకాకుండా విద్యపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

కార్యక్రమంలోని హక్కుల అవగాహన జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. హరికృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాల గురించి వివరించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పిల్లలు ప్రమాదకరమైన నీటి మడుగులు, కుంటలకు ఈతకు వెళ్లరాదని హెచ్చరించారు. పిల్లలకు ఎలాంటి ఆపద కలిగినా వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ఏటూరునాగారాన్ని బాలల హక్కుల పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా నిలుపుతామని సభలో పాల్గొన్న వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వి. జనార్దన్, ఉప సర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, వార్డు సభ్యులు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ వసంత, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.

Next Story