మహాబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న వడదెబ్బ మృతులు..!

by Ratna Kumari |

భానుడి భగభగలతో మహబూబాబాద్ జిల్లా అగ్గిమీద గుగ్గిలంలా మారుతోంది. ఉదయం 9 గంటలు దాటకముందే రోడ్లు తాకలేని స్థాయికి చేరుతుండగా.. మధ్యాహ్నానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

మహాబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న వడదెబ్బ మృతులు..!
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : భానుడి భగభగలతో మహబూబాబాద్ జిల్లా అగ్గిమీద గుగ్గిలంలా మారుతోంది. ఉదయం 9 గంటలు దాటకముందే రోడ్లు తాకలేని స్థాయికి చేరుతుండగా.. మధ్యాహ్నానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుండటంతో జిల్లాలో వడదెబ్బ మరణాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దినసరి కూలీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. వేడిగాలులు,ఉక్కపోత, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మధ్యాహ్న వేళల్లో గ్రామ వీధులు వెలవెలబోతుండగా, అత్యవసర పనులు మినహా ప్రజలు బయటకు రావడం తగ్గించారు.అయినప్పటికీ ఉపాధి కోసం కూలీలు మండుటెండల్లోనే పనులకు వెళ్లాల్సి వస్తోంది.

జిల్లాలోని పలు మండలాల్లో వడదెబ్బ కారణంగా వృద్ధులు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు ఇంటి ముందు కూర్చున్న సమయంలోనే స్పృహ తప్పి పడిపోగా, మరికొందరు పొలం పనులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది.అధికారిక లెక్కలు పూర్తిగా వెలువడకపోయినా, గ్రామాల్లో మాత్రం “వడదెబ్బకి బలి అయ్యారు” అన్న చర్చలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి శుక్రవారం వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 14 మంది వరకు వడదెబ్బతో మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు..!

జిల్లా ప్రభుత్వాస్పత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వడదెబ్బ,డీహైడ్రేషన్, వాంతులు, జ్వరంతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు,కూలీలు ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఎండలో ఎక్కువసేపు పనిచేయొద్దని హెచ్చరిస్తున్నా, పేద ప్రజలు ఉపాధి కోసం మండుటెండల్లోనే కష్టాలు పడుతున్నారు.

వృద్ధులే ఎక్కువగా బలి..!

వడదెబ్బకు గురవుతున్న వారిలో అధిక శాతం వృద్ధులేనని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరగడం,శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఉండటంతో ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఒంటరిగా నివసించే వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పోస్టుమార్టం అంటే వెనకడుగు వేస్తున్నారు వైద్యులు.!

వడదెబ్బ కారణాలతో మృతి చెందారని భావించే క్రమంలో శాస్త్రీయంగా నిర్ధారించడానికి పోస్టుమార్టం తప్పనిసరి ఐతే వడదెబ్బ వల్ల మృతి చెందినట్లు భావించినప్పటికీ మృతుని బంధువులు పోస్టుమార్టం అనగానే అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తుండడంతో శాస్త్రీయంగా వడదెబ్బతో మృతి చెందినట్లు గుర్తించడం కష్టంగా మారుతుందని వైద్యులు తెలుపుతున్నారు.అలాగే డిస్టిక్ ఎఫాడమిక్ టీం మృతుల బంధువులకు శవ పరీక్ష చేయాలంటూ సర్ది చెప్పినప్పటికీ ససేమిరా అంటున్నట్టు వారు చెబుతున్నారు.

Next Story