గోరంత అనుమతి, కొండంత దందా: అడ్డూ అదుపు లేని మట్టి మాఫియా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-19 02:18:55  IST  )

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలో కొందరు మట్టి దందా నిర్వహిస్తున్నారు. గోరంత అనుమతులు పొంది కొండంత మట్టిని తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గోరంత అనుమతి, కొండంత దందా: అడ్డూ అదుపు లేని మట్టి మాఫియా
X

దిశ, కన్నాయిగూడెం: మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలో కొందరు మట్టి దందా నిర్వహిస్తున్నారు. గోరంత అనుమతులు పొంది కొండంత మట్టిని తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మండలంలోని లక్ష్మీపురం, కన్నాయిగూడెం, బుట్టాయిగూడెం, చింతగూడెం , ఏటూరు గ్రామాల్లో మట్టి మాఫియాకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికారుల దృష్టికి సమాచారం వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండాపోతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి అధికారులే భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి.

గ్రామాల్లోనే దందా అధికం..

మండలాల్లోని పలు గ్రామాల్లో నిత్యం మట్టి దందా సాగుతోంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు ఏకైక మార్గంగా ఎంచుకున్నారు. హైదరాబాద్ లాంటి మహా నగరాల నుంచి జేసీబీలు లీజ్ కు తీసుకుని వాటి సాయంతో మట్టిని తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో నూతన గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ కార్యాలయాల పనులకు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు రూ.800 వరకు వసూలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఏకంగా తహసీల్దార్​కార్యాలయం ఎదుట నిర్మాణాలకు మట్టి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వాదాయానికి గండి..

మండలంలో మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల నుంచి మట్టిని తరలించాలన్నా లేదా ప్రైవేట్ భూమిని చదును చేయాలన్నా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరపాలంటే మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అందుకు కొంత నగదును ప్రభుత్వానికి సేల్ రూపేనా చెల్లించాలి. అయితే ఇలాంటిదేమి లేకుండా దర్జాగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల అండ..

మట్టిదందాపై మండల పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మట్టి మాఫియాను వదిలిపెట్టడం వెనుక అధికారులు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి మాఫియాకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

Next Story