వరంగల్ బల్దియాలో బడా దోమల బెడద..!

by Ramesh Goud |

వరంగల్‌ మహానగరంలో ప్రజా సమస్యలపై పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యానికి నగరంలో తిరుగుతున్న దోమలే సాక్ష్యం.

వరంగల్ బల్దియాలో బడా దోమల బెడద..!
X

దిశ, వరంగల్‌ టౌన్ : వరంగల్‌ మహానగరంలో ప్రజా సమస్యలపై పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యానికి నగరంలో తిరుగుతున్న దోమలే సాక్ష్యం. ఒక్కో దోమ పెద్ద రేగుపండును మించేంతగా ఎదిగి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 66 డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. పేదలు నివసించే కాలనీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. శివారు ప్రాంతాల్లోనూ దోమల రాజ్యమే కొనసాగుతోంది. సాయంత్రం ఆరింటి నుంచి దోమలు చెవుల్లో జోరీల్లాగా శబ్ధాలు చేస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దోమలతో అనారోగ్యంపాలవుతున్నామని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో దోమకాటు బాధితుల కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

దోమల మందు వాసనే కరువు?

ఇక నగరంలో దోమల నివారణ కోసం బల్దియా చేపడుతున్న చర్యలు మృగ్యమనే చెప్పాలి. ఏ డివిజన్‌లో ప్రజలను ఆరా తీసిన తమ ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయడం లేదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. అదీగాక.. ఫాగింగ్‌ ఆటోలు కొన్ని మూలన పడ్డాయి. ఫాగింగ్‌ యంత్రాలు కూడా సరిగా పని చేయడం లేదు. అంతేకాదు, లక్షలు పోసి కొనుగోలు చేసిన కొన్ని ఫాగింగ్‌ యంత్రాలు రెండేళ్లయినా బల్దియాకు చేరుకోలేదు. దీంతో ఉన్న రెండు, మూడు ఫాగింగ్‌ యంత్రాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా నగరంలో పూర్తిస్థాయిలో దోమల నివారణ మందు పిచికారీ చేయడంలో బల్దియా అధికారులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. అయినా.. రోజువారీగా దోమల నివారణ కోసం 66 లీటర్ల పెట్రోల్, 330 లీటర్ల డీజిల్, సంబంధిత కెమికల్స్ వాడకానికి రూ.50నుంచి 60వేలు, కాగా నెలకు రూ.18 లక్షలు, ఏడాదికి రూ.2కోట్ల 16లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపడం అధికారుల చేతివాటానికి అద్దం పడుతోంది. వాటాధనం తీసుకోవడం వల్లే మేయర్‌ దోమల నివారణ చర్యలపై సమీక్షించడం లేదని విమర్శిస్తున్నారు. రెండేళ్లయినా ఫాగింగ్‌ యంత్రాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దోమల నిధులు కూడా నొక్కేస్తున్న బల్దియా వింగ్‌ పై నగరవాసులు మండిపడుతున్నారు.

వాన పడ్డప్పుడు ఒక్కసారి.. ఎర్రం నీరజ, 14వ డివిజన్ మణికంఠకాలనీ

మా ఏరియాలో వానపడ్డప్పుడు ఒక్కసారి దోమల మందు కొట్టిండ్లు. అంతే.. ఇంతవరకు మళ్లీ కొట్టలేదు. దోమలు మాత్రం మస్తుగున్నయ్‌. సాయంత్రం చీకటి పడిందంటే కుట్టి సంపుతానయ్‌. మస్కిటో కాయిల్స్‌ ఒక్కరోజు రాత్రి రెండు, మూడు అయిపోతానయ్‌.

8 నెలల కిందట కొట్టిర్రు.. మంతెన దేవిక, మణికంఠకాలనీ

మా కాలనీల దోమలు ఒక్కొక్కటి ఈగలంత ఉన్నయ్‌. కుడితే పెద్దబొట్టు బిల్లంత దద్దులు వస్తున్నయ్‌. మున్సిపాలిటోళ్లు 8నెలల కిందట ఒక్కసారే పొగమందు కొట్టిండ్లు. ఇటు మొఖాన వచ్చిన పాపాన పోలేదు. చెవుల వద్ద దోమలు గుయ్‌ మంటానయ్‌. కాలనీలో చాలామందికి జ్వరాలు కూడా వచ్చినయ్‌.

ఐదేండ్ల నుంచి కొడ్తనే లేరు.. మార్టిన్‌ లూథర్‌, పరిమళకాలనీ

మాది 16వ డివిజన్‌, పరిమళకాలనీ. దోమలు విపరీతంగా ఉన్నయ్‌. సాయంత్రం అయితే మొత్తం మనిషి చుట్టే తిరుగుతానయ్‌. ఐదేండ్ల నుంచి మా కాలనీలో మున్సిపాలిటీ దోమల పొగమందు వాసనే లేదు. ఒక్కసారి కూడా కొట్టిన లెక్కలు లేవు. మున్సిపల్‌ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.

Next Story