ఎస్సీ గురుకులాల్లో అడ్మిషన్ల గందరగోళం.. అల్లాడుతున్న విద్యార్థులు, పేరెంట్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 01:35:15  IST  )

ఎస్సీ గురుకులాల్లో అడ్మిషన్ల విషయంలో గందరగోళం నెలకొంది.

ఎస్సీ గురుకులాల్లో అడ్మిషన్ల గందరగోళం.. అల్లాడుతున్న విద్యార్థులు, పేరెంట్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణంగా అకడమిక్ ఇయర్ ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యేవరకు సంబంధిత విద్యా సంస్థల మేనేజ్మెంట్లు స్థానికంగా అందుబాటులో ఉండాలి. అడ్మిషన్లల్లో తలెత్తే సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. కాని ఎస్సీ గురుకులాల సంస్థ సెక్రటరీ మాత్రం అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎప్పుడు వెళ్లినా ఆమె ఆఫీసు పని పేరుతో సెక్రటేరియట్ లోనే ఉంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. దీనితో సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే పేరంట్స్,స్టూడెంట్స్ ఆఫీసు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

ఆఫీసు ఒక చోట డ్యూటీ మరోచోట

ఎస్సీ గురుకులాల సంస్థకు రెగ్యూలర్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి విజయేంద్ర బోయి సెలవుల నుంచి వచ్చిన తరువాత పలు కారణాల వల్ల బాధ్యతలు చేపట్టలేదు. దీనితో టీచింగ్ స్టాఫ్ నుంచి ప్రమోషన్ల ద్వారా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తోన్న శారదను ఇన్ చార్జి సెక్రటరీగా కొనసాగిస్తున్నారు. అయితే అకడమిక్ ఇయర్ ప్రారంభంలో అడ్మిషన్ల కోసం నిత్యం వందలాది మంది పేరంట్స్,స్టూడెంట్స్ సుదూర ప్రాంతాల నుంచి హెడ్ ఆఫీసుకు వస్తుంటారు. సీటు వచ్చిన స్కూల్ దూరంగా ఉండటంతో,దగ్గరగా ఉన్న స్కూల్ లో అడ్మిషన్ కల్పించాలంటూ విజ్ఞప్తులు చేస్తుంటారు. ఇంకొందరు తము ఎంపిక చేసుకున్న స్కూల్స్ లో సౌకర్యాలు లేవని, ఇతర స్కూల్స్ కు అడ్మిషన్ మార్చాలని అడుగుతుంటారు. ఇలా ప్రతి నిత్యం వందలాది మంది స్టూడెంట్స్ పేరంట్స్ ను వెంటపెట్టుకుని హెడ్ ఆఫీసుకు వస్తారు. ఈ సమస్యలను సెక్రటరీ స్థాయి అధికారి మాత్రమే పరిష్కరించాలి. కాని సెక్రటరీ హెడ్ ఆఫీసులో అందుబాటులో ఉండటంలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఆమె ఉదయం ఆఫీసుకు వచ్చి పిల్లల వెల్కమ్ కిట్స్ కు సంబంధించిన పని ఉందంటూ సెక్రటేరియట్ కు వెళ్లడం పరిపాటిగా మారిందని కామెంట్స్ ఉన్నాయి. స్కూల్స్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆమె హెడ్ ఆఫీసులో కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

అధికారుల మధ్య గ్యాప్

హెడ్ ఆఫీసులో సెక్రటరీ అందుబాటులో ఉండకపోవడంతో ఇతర అధికారులు పిల్లల సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టడం లేదని ప్రచారం జరుగుతున్నది. అడ్మిషన్ల విభాగానికి చెందిన అధికారులు పేరంట్స్,స్టూడెంట్స్ ఇస్తున్న వినతి పత్రాలు తీసుకోవడం తప్పా, సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనితో బాధితులు సుదూర ప్రాంతాల నుంచి హెడ్ ఆఫీసుకు వారంలో రెండు మూడు సార్లు వస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇన్ చార్జి సెక్రటరీగా ఉన్న శారదకు హెడ్ ఆఫీసులో పనిచేస్తోన్న ఇతర అధికారుల మధ్య గ్యాప్ ఉందని, ఆ ఎఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ పై పడుతుందని అభిప్రాయాలు ఉన్నాయి. మొన్నటి వరకు జాయింట్ సెక్రటరీ హోదాలో తమతో పాటు పనిచేసిన అధికారికి ఇన్ చార్జి సెక్రటరీ బాధ్యతలు ఇవ్వడాన్ని జీర్ఙించుకోలేని అధికారులు ఆమెకు సహకరించడం లేదని టాక్ ఉంది. అందుకే హెడ్ ఆఫీసుకు వచ్చే పిల్లల సమస్యలను పరిష్కరించడం లేదని చర్చ జరుగుతున్నది.

హెడ్ ఆఫీసులో మంత్రి, సెక్రటేరియట్‌లో అధికారి

ఈ మధ్య సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గురుకులాల సంస్థ పనితీరును తెలుసుకునేందుకు హెడ్ ఆఫీసును ఆకస్మకంగా తనిఖీ చేశారు. అడ్మిషన్ల కోసం వచ్చిన విద్యార్థులు,తల్లిదండ్రల సమస్యలను నేరుగా విన్నారు. సొంత జిల్లాలో అడ్మిషన్ ఇవ్వకుండా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో సీటు ఇవ్వడంపైనే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. అయితే సాధ్యమైనంత మేరకు స్టూడెంట్స్ సొంత జిల్లాల్లోనే అడ్మిషన్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అయితే మంత్రి ఆకస్మిక తనిఖీ చేస్తోన్న సమయంలో హెడ్ ఆఫీసులో ఉండాల్సిన ఇన్ చార్జి సెక్రటరీ శారద సెక్రటేరయట్ ఉన్నారు. సమాచారం తెలుసుకుని కూడా అమె హెడ్ ఆఫీసుకు రాలేదని ప్రచారం జరుగుతున్నది.

Next Story