- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మక్క - సారలమ్మ మహా జాతర కు భారీ ఏర్పాట్లు
ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేడారం మహా జాతర ఘట్టం మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేడారం మహా జాతర ఘట్టం మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ మహా జాతరకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్ల కల్పనకు, గద్దెల పునరుద్ధరణ పనులకు 251 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేసి సకాలంలో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. మహా జాతర కు భారీ ఏర్పాట్లు తుది దశకు చేరుకోగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఏర్పాట్లును క్షేత్ర స్థాయిలోనే ఉండి ప్రతి విభాగం పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనెల 18న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రావడమే కాకుండా అదే రోజు రాత్రి మేడారంలోని బస్సు చేసిన అనంతరం 19వ తేదీన అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. అనంతరం మహా జాతర ప్రాంగణంలోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఏర్పడకుండా మంత్రి సీతక్క రేయింబవులు మేడారంలోనే తిష్ట వేసి పనులను పరిశీలిస్తున్నారు. భక్తుల సౌకర్యం, సుభిక్ష దర్శనం చేయించడమే లక్ష్యంగా నిర్ణయించి ప్రతి విషయంలో ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులతో కలిసి సమగ్ర ప్రణాళికతో ముందుకు ప్రయాణిస్తున్నారు. మహా జాతర విజయవంతానికి సవాలుగా తీసుకున్న మంత్రి సీతక్క జాతర పనులపై ప్రత్యేక దృష్టి సారించడం చెప్పుకోదగ్గ విషయం.
జాతర విజయవంతానికి 21 శాఖల అధికారులు
మహాజాతను విజయవంతం చేయడానికి మొత్తం 21 శాఖలకు చెందిన 42, వేల 27 మంది అధికారులు, సిబ్బంది మేడారం తో పాటు పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనుండగా వీరికి తోడుగా 2 వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా, 42 సెక్టర్లుగా విభజించారు. ఒక్కో జోన్ కు జిల్లా స్థాయి అధికారి బాధ్యులుగా విధులు నిర్వహించనుండగా ఒక్కో సెక్టార్ కు మండల స్థాయి అధికారి భాద్యతలు నిర్వర్తిస్తారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, నర్లాపూర్, పడిగాపూర్ ఇతర కీలక ప్రాంతాలను కమాన్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మత్తులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేశారు.
భక్తులకు శుద్ధమైన మంచినీరు పంపిణీ
తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా నిరంతం తాగు నీటి సరఫరా జరిగేలా మొత్తం 5,482 తాగు నీటి నల్లాలు ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం 5 వేల మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషిన్లు, 12 జేసీబీ, 40 స్వచ్చ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు.
శాశ్వత తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లు సిద్ధం
మహా జాతరకు వచ్చే భక్తులు మరుగుదొడ్లను ఉపయోగించుకోవడానికి 285 బ్లాకుల్లో 5700 టాయిలెట్లను సిద్దం చేయగా వీటికి అధనంగా మోబైల్ టాయిలెట్స్ ను అందుబాటులోకి తేనున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న వీటికి తోడుగా శాశ్వత మరుగుదొడ్లను సైతం ఏర్పాటు చేశారు.
నిరంతరం విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు
జాతర సందర్భంగా మేడారంతో పాటు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా టీజీఎన్‌పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయగా, విద్యుత్ సరఫరా లో అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆలయాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హై పవర్ లైట్లు ఏర్పాటు చేయగా అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్ జనరేటర్లు సిద్ధం చేశారు.
భక్తులను చేరవేర్చడానికి టీజీ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు
మేడారం మహా జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులను మేడారం తరలించడానికి తిరిగి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి 3 వేల 700 వందల బస్సులకు పైగా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా మేడారంలో ప్రత్యేక బస్టాండ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సులు నడపడానికి సిద్ధం చేస్తున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించింది. జాతర సందర్భంగా 10వేల 441 మంది ఆర్టీసీ సిబ్బంది విధులలో పాల్గొననున్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది సిద్దం
జాతర సందర్భంగా మేడారం తో పాటు పరిసర ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది సిద్దమయ్యారు. జాతరకు నెల ముందు నుండే వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు జాతర అనంతరం మరో నెల రోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఆరోగ్య సేవల కోసం మొత్తం 5 వేల 192 మంది వైద్య సిబ్బందిని నియమించగా, భక్తులకు సేవలందించేందుకు 30 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు, 50 పడకల ప్రధాన ఆసుపత్రి, రోజుకు 30 మెడికల్ క్యాంపులు పనిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రమాదాలను నివారించేందుకు రంగంలోకి సిబ్బంది
జాతర సందర్భంగా జంపన్నవాగులో ప్రమాదాలను నివారించేందుకు 210 మంది గజ ఈతగాళ్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది, 100 ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నాయి. వీరికి తోడుగా సింగరేణి సంబంధించిన సిబ్బంది తమ సేవలను కొనసాగించనున్నారు. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు 15 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లు విధులు నిర్వహించనున్నారు.
నిరంతరం సెల్ ఇంటర్నెట్ నెట్ సేవలు
మేడారం జాతర సందర్భంగా నాలుగు రోజుల పాటు లక్షలాదిమంది భక్తులు మేడారం గ్రామంలో తిష్ట వేసిన సందర్భంలో సెల్ ఫోన్ సిగ్నల్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్, ప్రైవేట్ సెల్ సంస్థలు ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 27 శాశ్వత టవర్లతో పాటు తాత్కాలిక పద్దతిలో 33 మోబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జాతర సమయంలో జరుగుతున్న విశేషాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి అవసరం కానున్న ఇంటర్నెట్ సేవలు విషయంలో ఆయా సంస్థలు ప్రత్యేక తీసుకుంటున్నాయి. మేడారం మహా జాతర –2026ను ప్రపంచ వ్యాప్తంగా తెలియచేయాలన్న లక్ష్యంతో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు త్వరితగతిన తల్లుల దర్శనం, సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది.






