మేడారం సమక్క-సారక్క జాతరలో హైటెక్ భద్రత

by velandi.Saikiran |   (  Updated:2026-01-10 22:45:15  IST  )

ఆదివాసీ కుంభమేళా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమవుతుంది. మొదటి సారిగా శాశ్వత నిర్మాణం పనులు చేపట్టి గద్దెలను పునరుద్దరిస్తున్నారు.

మేడారం సమక్క-సారక్క జాతరలో హైటెక్ భద్రత
X

తుది దశకు మేడారం పనుల

=ఆదివాసీ కుంభమేళా జాతరకు శాశ్వత నిర్మాణాలు

=రూ.101 కోట్లతో శాశ్వత గద్దెలు, ప్రాకారాల నిర్మాణాలు

=ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది దర్శనం చేసుకునే విధంగా క్యూలైన్ల నిర్మాణం

=సమక్క-సారక్క జాతరలో హైటెక్ భద్రత

=విఐపిలకు ప్రత్యేక ఏర్పాట్లు

దిశ, వరంగల్ బ్యూరో : ఆదివాసీ కుంభమేళా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమవుతుంది. మొదటి సారిగా శాశ్వత నిర్మాణం పనులు చేపట్టి గద్దెలను పునరుద్దరిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఒకేసారి 7 నుంచి 8వేల మంది భక్తులు దర్శించుకునే విధంగా క్యూ లైన్ లను ఏర్పాటు చేస్తున్నారు. విఐపిలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెల వద్ద శాశ్వత నిర్మాణం పనులు చేపట్టడంతో పాటు జాతరకు ఇంకా 18 రోజులే సమయం ఉండటంతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ నెల 18న మేడారానికిసీఎం వస్తుండటం,19 న గద్దెల పునరుద్ధరణ ప్రారంభ కార్యక్రమాలు చేయనుండటంతో ఆ లోపే పనులు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి జాతరలో భద్రత, ట్రాపిక్ కోసం సీసీకెమెరాలు, డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో రెండేళ్ల కొకసారి జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర కోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గతంలో లాగా జాతర సమయంలో చేపట్టే పనులకు భిన్నంగా 101 కోట్లతో గద్దెల శాశ్వత నిర్మాణం చేపట్టారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ధరాజు గద్దెఆల్టో పాటు చుట్టూ ప్రాకారం నిర్మాణాలు చేపట్టారు. ఎప్పుడు లేని విధంగా రాతి శిలలతో గ్రానైట్ నిర్మాణాలతో ఇష్ట దైవాలను భక్తులు ఇష్టంగా కొలిచే విధంగా గద్దెల నిర్మాణం చేస్తున్నారు. ప్రాకారం చుట్టూ రాతి శిలలపైన ఆదివాసుల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు తెలిపే విధంగా చిత్రాలను చెక్కారు. ఈ దఫా నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునే విధంగా శాశ్వత నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ నిర్మాణాలన్నీ ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే విధంగా పనులు పూర్తి చేస్తున్నారు.

మేడారంలో హైటెక్ భద్రత..

జాతర గద్దెల వద్దనే కాకుండా జాతర నిర్వాహణ కోసం 150 కోట్లను కేటాయించారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా మేడారంలో రోడ్లను వెడల్పు చేశారు. లక్షల మంది వచ్చిన దర్శనం చేసుకుని వెళ్ళేవిధంగా రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. శాశ్వత నిర్మాణాలు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాల కోసం ప్రత్యేకంగా 8 చోట్ల ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగు వద్ద స్నానాలకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. మేడారంలో అతిపెద్ద సానిటరీ సమస్యకు ఇబ్బందులు లేకుండా గ్రీన్ టాయిలెట్లను ఎక్కువగా వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరుకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు పూర్తిచేస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు సుమారు 30వేల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నారు. ఇప్పటికే 6వేల మంది ఉద్యోగులు జాతర స్థలంలో పనుల్లో నిమగ్నమయ్యారు. మేడారం జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు రానుండటంతో భారీ భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ దఫా మేడారంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసి 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో 20 డ్రోన్ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భద్రత కోసం వినియోగిస్తున్నారు. పూర్తిస్థాయిలో బందోబస్తు కోసం 12వేల మంది వరకు పోలీసులను వినియోగిస్తున్నారు.

జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనులు పూర్తి చేయడంతో పాటు పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేస్తున్నారు.

Next Story