'హైటెక్'​మోసం..!

by Ajay Maddhiboyina |

ములుగును జిల్లాగా ప్రకటించిన అతి తక్కువ కాలంలో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా పుంజుకుంది.

హైటెక్​మోసం..!
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగును జిల్లాగా ప్రకటించిన అతి తక్కువ కాలంలో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా పుంజుకుంది. జిల్లా కేంద్రంలో సొంత ఇంటి కల కోసం ఆశపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకున్న రియల్​వ్యాపారులు ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదే అదునుగా వ్యవసాయ భూములను ఎకరాల చొప్పున తక్కువ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసి వెంచర్ల పేరుతో గుంటల చొప్పున అమ్మి లాభాలను ఆర్జిస్తుంటే, మరి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు డీటీసీపీ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ సామాన్య జనాలను బురిడీ కొట్టించి తమ వెంచర్ లోని ప్లాట్లను స్మార్ట్ గా కట్టబెడుతూ కొత్త రకం భూ దందాకు తెరతీస్తున్నారు.

ములుగు జిల్లా కేంద్రం ములుగు మున్సిపాలిటీగా మారుతుందని ఆశచూపి నామమాత్రపు అనుమతులు ఉన్న వెంచర్ పేరును డీటీసీపీ వచ్చిందని ఆశ చూపి వినియోగదారులకు కట్టబెడుతూ స్మార్ట్ గా తమ వెంచర్ లోని ప్లాట్లను విక్రయిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని జగ్గన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో ములుగు హైటెక్ సిటీ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్ తాత్కాలిక అనుమతులు పొంది పనులు పూర్తికాకుండానే డీటీసీపీ అప్రూవల్ ఉందంటూ ఫ్లెక్సీలు, బ్రోచర్లతో ప్రచారం చేపట్టి అమాయకపు జనాలకు ప్లాట్లు కట్టబెట్టారు. తమ వెంచర్ బ్రోచర్లు స్మార్ట్ ఫోన్లలో షేర్ చేస్తూ స్మార్ట్ గా ప్రచారం చేసి అమ్మేసి డీటీసీపీ ఫైనల్ అప్రూవల్ రాకముందే ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేసినా సంబంధిత అధికారులు అడ్డు చెప్పకపోవడం ప్రజలలో అనేక అనుమానాలకు తావిస్తోంది.

డీటీసీపీ నిబంధనలు ఇలా..

డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నిబంధనల ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసే వెంచర్లు గ్రామపంచాయతీ అభివృద్ధి పనుల కోసం కొంత స్థలాన్ని కేటాయించాలి. వెంచర్ లో రహదారులు, నీటి వసతి, మురుగు కాలువలు, వీధి దీపాలు నిర్మించడం కోసం డీటీసీపీ వద్ద దరఖాస్తు చేసుకుని అభివృద్ధి పనుల కోసం తాత్కాలిక అనుమతి తీసుకోవాలి. అనంతరం అభివృద్ధి పనులు పూర్తిచేసి డీటీసీపీ వారి వద్ద నుంచి గ్రామపంచాయతీకి కొంత స్థలం కేటాయించి పనులన్నీ పూర్తయిన తర్వాత డీటీసీపీ బృందం పనులను పరిశీలించి తదుపరి సంబంధిత లేఔట్ యజమానికి డీటీసీపీ ఫైనల్ అప్రూవల్ జారీ చేస్తారు. ఫైనల్ అప్రూవల్ వచ్చిన లేఅవుట్ లో మాత్రమే గ్రామపంచాయతీ అనుమతి తీసుకుని ఇంటి నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక అనుమతులు పొందిన హైటెక్ సిటీ యాజమాన్యం డీటీసీపీ అనుమతి లభించిందని ప్రచారం చేసుకుని ప్లాట్లు అమ్మడం, ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

మొహం చాటేసిన వెంచర్ యాజమాన్యం...

ములుగు జిల్లా కేంద్రానికి కేవలం కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ వెంచర్ ఇప్పుడొక వంచనగా మారింది. డీటీసీపీ అప్రూవల్ ఉందని, వేగంగా అభివృద్ధి చేసి నివాసయోగ్యమైన వెంచర్ గా తీర్చిదిద్దుతామని అప్పట్లో యాజమాన్యం గొప్పగా హామీలు ఇచ్చింది. ప్రముఖులను పిలిచి అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరిపి ఆరు నెలల పాటు హడావిడి చేసి ప్లాట్ల అమ్మకాలు ముగించగానే యాజమాన్యం మొహం చాటేసింది. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఫైనల్ డీటీసీపీ అప్రూవల్ రాకపోవడం, కనీసం దానికి అవసరమైన ప్రయత్నాలు కూడా చేయకపోవడంపై ప్లాట్లు కొన్న సామాన్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడూ రెండు, మూడు నెలల్లో ఫైనల్ అప్రూవల్ వస్తుందని యాజమాన్యం చెప్పిన మాటలు విన్న వందలాది మంది ఇప్పుడు మోసపోయామని వాపోతున్నారు.

పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణం...

వెంటనే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో హైటెక్ సిటీ వెంచర్లో కొంతమంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. గ్రామపంచాయతీ నుంచి అనుమతులు తీసుకోకుండానే రెండు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. గ్రామపంచాయతీ సిబ్బంది నోటీసులను సైతం పరిగణలోకి తీసుకోకుండా ఇంటి నిర్మాణాలు పూర్తి చేశారు. నిర్మాణాలు పూర్తయి మూడు నెలలు దాటినా పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు లేకపోవడం గ్రామస్తుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తాం..

జిల్లాలో అనుమతులు లేకుండా నిర్మించే అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. జగ్గన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని హైటెక్ సిటీ వెంచర్ లో నిర్మిస్తున్న భవనాల విషయం మా దృష్టికి వచ్చింది. నిర్మాణాల విషయంలో లోతైన విచారణ జరిపి అనుమతులు లేని భవనాల పైన కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వెంచర్లలో ప్రజలు ఎవరూ ప్లాట్లుకొని మోసపోవద్దు.

-ములుగు డీపీఓ దేవరాజ్

Next Story