ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు.. భూముల కొనుగోళ్ల‌లో ఫెమా ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు

by Bhanu |

కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు.. భూముల కొనుగోళ్ల‌లో ఫెమా ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు
X

దిశ‌, దేవ‌రుప్పుల : కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒక కేసులో భాగంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీ రెడ్డి దంపతులు 2017లో సుమారు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల్లోనే ఇక్క‌డ భూముల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. అయితే ఈ భూముల కొనుగోలుపై దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విదేశీ పౌరసత్వం కలిగిన ఝాన్సీ రెడ్డి ఇక్కడ వ్యవసాయ భూమి ఎలా కొనుగోలు చేస్తారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ వాదనల ప్రకారం, ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా పౌరసత్వం స్వీకరించారని, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం ఆమె వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.


తప్పుడు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించి రెవెన్యూ అధికారులు త‌ప్పుదోవ ప‌ట్టించారంటూ, నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం కూడా జారీ చేశారని పిటిషన్‌లో ఆరోపణలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ పిటిషన్‌పై మే 1వ తేదీన జస్టిస్ సీవీ భాస్కరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజా విచారణలో... ఝాన్సీ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో, భూమి కొనుగోలు వ్యవహారంపై జూన్ 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఝాన్సీరెడ్డికి, ఆమె భ‌ర్త‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. వారితో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్‌లకు కూడా న్యాయస్థానం నోటీసులు పంపండం గ‌మ‌నార్హం. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో తాజా ప‌రిణామం రాజ‌కీయ వేడి పుట్టిస్తోంది.

Next Story