హనుమకొండలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష..

by Bhanu |

హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది.

హనుమకొండలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష..
X

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. సమీక్షకు ముందు ఎంపీ డా. కడియం కావ్య ఆసుపత్రిలోని విభాగాలను సందర్శించి, అందిస్తున్న వైద్య సేవలపై సమగ్రంగా విచారించారు. ఇన్‌పేషెంట్‌, ఔట్‌పేషెంట్‌, ప్రసూతి విభాగం, శిశువుల సంరక్షణ, ల్యాబ్‌లు, మందుల నిల్వలు, శానిటేషన్ వసతులపై ప్రత్యక్షంగా సమీక్షించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలతో పరస్పరంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అవసరమైన మెరుగుదలలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. 2009 తర్వాత ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష జరగడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని విస్మరించగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్య హక్కు కోసం చిత్తశుద్ధితో ముందుకెళ్తోంది.

ఆసుపత్రిలో అత్యవసర మందులు, బ్లడ్, ఆక్సిజన్ అందుబాటులో ఉండాలని, శానిటేషన్ వ్యవస్థ మెరుగు పడాలని, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచాలని సూచనలు ఇచ్చాం. రికార్డుల నిర్వహణకూ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించాం, అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ, ఆసుపత్రి సూపరిండెంట్, వైద్య సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యంతో వేగంగా ముందుకు తీసుకెళ్తామని ఎంపీ స్పష్టం చేశారు.

Next Story