మహిళా ఫైనాన్సర్ అరెస్ట్.. కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-08 15:34:09  IST  )

నర్సంపేట పట్టణానికి చెందిన మహిళా ఫైనాన్సర్ గుజ్జ సుజాతను పోలీసులు అరెస్ట్ చేసినట్లు నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి స్పష్టం చేశారు.

మహిళా ఫైనాన్సర్ అరెస్ట్.. కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
X

మహిళా ఫైనాన్సర్ అరెస్ట్.. కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

- బెయిల్ మంజూరుతో నో రిమాండ్

- వృథా అయిన పోలీసుల శ్రమ...

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన మహిళా ఫైనాన్సర్ గుజ్జ సుజాతను పోలీసులు అరెస్ట్ చేసినట్లు నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి స్పష్టం చేశారు. కాగా కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గత 40 రోజులుగా పోలీసులు పడిన శ్రమకు ఫలితం లేకుండా పోయిందని డివిజన్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధిక వడ్డీ వేధింపులు, అక్రమంగా భూములు కాజేశారని ఆరోపిస్తూ గతంలో పలు కేసులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యాయి. జూలై 28న నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన వీరస్వామి అనే రైతు రూ.4 లక్షలు అప్పు చేయగా తన విలువైన వ్యవసాయ భూమిని అక్రమంగా కాజేశారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తదనంతరం అనేక మంది బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి దాదాపు 42 రోజుల అనంతరం సదరు మహిళను అరెస్ట్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

యాంటీ స్పెక్టరీ బెయిల్ తో పోలీసులకు చుక్కెదురు...

నర్సంపేట పట్టణానికి చెందిన గుజ్జ సుజాత గత 40 రోజులుగా పరారీలో ఉన్నారు. ఆమెపై దాదాపు 6 కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ క్రమంలో నర్సంపేట పోలీసులు నిద్రాహారాలు మాని ఢిల్లీ మొదలు గల్లీ వరకు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సదరు మహిళను సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ దొరకపట్టారు. ఎన్నో రోజులు శ్రమించిన పోలీసుల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సదరు మహిళను వరంగల్ కోర్టులో ప్రవేశ పెట్టారు. అప్పటికే యాంటీ స్పెక్టరీ బెయిల్ మంజూరు కావడంతో పోలీసులు చేసేదేం లేక వెనుదిరినట్లు తెలుస్తోంది. వీరస్వామి ఆత్మహత్య చేసుకున్న ఘటన సహా మరో ఐదు కేసుల్లో బెయిల్ రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story