ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి..

by Taduka Kalyani |

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు. గూడూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి..
X

దిశ, గూడూరు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు. గూడూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతుందని వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గూడూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్మెట్ లను అందించారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించామని మహబూబాబాద్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అలాగే గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై ఉక్కు పాదం మోపుతామని, గంజాయి అక్రమ రవాణాపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే వారికి 5000 రూపాయల బహుమానం అందిస్తామని వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్, ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ నాగ భవాని, నెక్కొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరేష్ రెడ్డి , జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, గూడూరు సీఐ వినయ్ కుమార్ ఎస్సై గిరిధర్ రెడ్డి, ఉపసర్పంచ్ చంటి స్వామి గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.

Next Story