రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

by Taduka Kalyani |

రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

రోడ్డు భద్రత నియమాలను పాటించాలి
X

దిశ, భూదాన్ పోచంపల్లి: రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,నీ భద్రత నీ చేతుల్లోనే ఉందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్లు ధరించకపోవడం, మొబైల్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి కారణాలవల్లే రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని, మైనర్లు, యువకులు, విద్యార్థుల నడవడికను గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి 7000 ఆక్సిడెంట్లు

ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని, మద్యం సేవించి వాహనం నడిపి ఏదైనా ప్రమాదానికి గురైతే తన కుటుంబంతో పాటు ఇతరుల కుటుంబం కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. ఇంటికి తాళం, ఫోన్ కు పౌచ్ ధరించేందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, మన ప్రాణాన్ని రక్షించే హెల్మెట్ కు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హెల్మెట్ కేవలం చలాన్ల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదని, ప్రాణ రక్షణ కోసం ఉపయోగపడే భద్రత కవచమని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి 7000 ఆక్సిడెంట్లు ,రోజుకు 20 యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని యువకులకు, విద్యార్థులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, వినోద్, చౌటుప్పల్ డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి, ఆర్డీవో శేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్, రూరల్ సీఐ రాములు, పోచంపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో విజయ, ఎంపీవో శశికళ, మండల వ్యవసాయ అధికారి శైలజ, మండల వైద్యాధికారి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story