హిట్ అండ్ రన్ పై పోరాటానికి సిద్ధమవుతున్న ఆదివాసీ సేన

by Bhanu |

ఇసుక లారీల వేగవంతమైన, నిర్లక్ష్యంగా జరిగే రాకపోకల వల్ల వరుసగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

హిట్ అండ్ రన్ పై పోరాటానికి సిద్ధమవుతున్న ఆదివాసీ సేన
X

దిశ, ఏటూరునాగారం : ఇసుక లారీల వేగవంతమైన, నిర్లక్ష్యంగా జరిగే రాకపోకల వల్ల వరుసగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

బుధవారం రాత్రి ఏటూరునాగారం సమీపంలో ఓ లారీ రాంగ్ రూట్‌లో వెళ్లి, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్లూరి రవి కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి మట్టి రవి శంకర్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు నర్సింహా మూర్తి తెలిపారు.

అతివేగం, ఓవర్‌టేకింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూనే మొబైల్‌లో మాట్లాడటం వంటి కారణాలతో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే వందలాది కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాయని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ చర్యలపై విమర్శలు:

ప్రభుత్వం ఇసుక తరలింపుపై చూపుతున్న శ్రద్ధను రోడ్డు భద్రత ఏర్పాట్లపై చూపడం లేదని పేర్కొన్నారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో ప్రజలు రోడ్డు మీద ప్రయాణించడానికి భయపడే స్థితి ఏర్పడిందన్నారు. రాత్రి పది గంటల తర్వాత మాత్రమే లారీల రాకపోకల్ని అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరా టీఎస్‌లను కోరారు.

హిట్ అండ్ రన్ చట్టాన్ని ప్రస్తావిస్తూ:

ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్లు బాధితులను వదిలేసి పరారవుతుండటం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హిట్ అండ్ రన్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు.

భవిష్యత్ కార్యాచరణ హెచ్చరిక:

ప్రమాద భీమా చట్టాల్లో స్పష్టత లేకపోవడం, నష్టపరిహారం కోసం బాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని నర్సింహా మూర్తి తప్పుబట్టారు. డిసెంబర్ నుండి మే వరకు ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పేర్కొంటూ, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగాపేట ప్రాంతాల్లో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని వివరించారు.

ఇప్పటివరకు లారీ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలనీ, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రవాణా భద్రత దృష్ట్యా తగిన చర్యలు లేకపోతే ప్రజల తరపున లారీలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

Next Story