ల్యాబ్స్ నిర్వహణపై గ్రహణం..!

by Nallavelli.Anjaneyulu |

నర్సంపేటలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. రక్త పరీక్షల్లో కింది స్థాయి సిబ్బంది పనితనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

ల్యాబ్స్ నిర్వహణపై గ్రహణం..!
X

దిశ, నర్సంపేట : నర్సంపేటలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. రక్త పరీక్షల్లో కింది స్థాయి సిబ్బంది పనితనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. వీళ్లను పర్యవేక్షణ చేయాల్సిన హెచ్. ఓ.డీ స్థాయి అధికారులు అందుబాటులో ఉన్నా పర్యవేక్షణ కొరవడటం విమర్శలకు తావిస్తోంది. ఒకప్పుడు ఉన్నత అధికారుల కొరత వల్ల ఇబ్బంది కలిగినప్పటికీ నేడు వాళ్ళు అందుబాటులో ఉన్నప్పటికీ డ్యూటీలు వేసే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అటెండెన్స్ రిజిస్టర్ల, బయో మెట్రిక్ నిర్వహణలో అలసత్వం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు గండి పడుతున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటం చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ల్యాబ్స్ వేరు ఇన్ చార్జి ఒకరు..!

నర్సంపేటలోని జిల్లాస్థాయి ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుండటం తెలిసిందే. వీరికి వివిధ కారణాలతో పలు రక్త పరీక్షలు చేస్తుంటారు. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉన్నట్లు తెలుస్తోంది. బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ ఉన్నాయి. ఈ మూడు ల్యాబ్స్ ఆధ్వర్యంలో రోగి రక్త నమూనాను బట్టి నిర్ధారక పరీక్షలు చేస్తుంటారు. ఒక్కో విభాగానికి ఒక్కో హెచ్. ఓ.డీ స్థాయి అధికారి సహా అతని కింద ల్యాబ్ టెక్నీషియన్స్, అసిస్టెంట్ లు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కింద గల మూడు ల్యాబ్స్ లో ఇటీవల నియామకం అయిన టెక్నీషియన్స్ మాత్రమే పని చేస్తున్నట్లు క్షేత్ర స్థాయిలో గమనించగా తెలుస్తోంది. పాథాలజీ ల్యాబ్ లో ముగ్గురు, మైక్రో బయాలజీలో ముగ్గురు, బయో కెమిస్ట్రీ లో ముగ్గురు చొప్పున షిఫ్టుల వారీగా పని చేస్తున్నట్లు సెంట్రల్ ల్యాబ్ నిర్వాహకులు తెలిపారు. వీరిపై పర్యవేక్షణ కోసం తప్పనిసరిగా సంబంధిత విభాగ హెచ్.ఓ.డీ ఉండాల్సి ఉంటుందన్నది సదరు విభాగ నిర్వాహకులు చెబుతున్నారు. వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదు.

మిషన్లు రిపేర్ వస్తే పరిస్థితి ఏంటీ..?

వాస్తవానికి ప్రతీ ల్యాబ్ లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండాల్సి ఉంటుంది. అధునాతన పరికరాల వినియోగం విషయంలో వీళ్ళకు మాత్రమే అవగాహన ఉంటుంది. ల్యాబ్స్ లో పనిచేసే టెక్నీషియన్స్ కి ప్రొసీజర్ పట్ల అవగాహన ఉన్నప్పటికీ ఎక్స్పర్ట్ తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. ఒక్కోసారి మిషన్ వాడకంలో ల్యాబ్ అసిస్టెంట్, టెక్నీషియన్ ల వల్ల మైన్యూర్ తప్పిదాలు జరిగిన క్రమంలో మిషన్లు మొరాయించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అందుబాటులో ఉన్న హెచ్.ఓ.డీ స్థాయి వ్యక్తులను విధులకు పురమాయించడంలో అలసత్వం వహించటం దీనికి ప్రధాన కారణమా తెలుస్తోంది.

టీ హబ్ పరిస్థితి అగమ్య గోచరం..

నర్సంపేట పట్టణంలో 52 రకాల వైద్య పరీక్షల కోసం టీ హబ్ ని రూ. కోటి 25 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 మండలాల నుండి, పలు పీ.హెచ్.సీ ల నుండి రక్త పరీక్షల నమూనాలను నిత్యం ఇక్కడికి తీసుకు వస్తున్నారు. ఇక్కడ సైతం చేసే వివిధ రకాల పరీక్షలకు కేవలం పాథాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ తో మాత్రమే పరీక్షలు చేపడుతున్నారు. కిందిస్థాయి సిబ్బంది ఉన్నప్పటికీ ఒక విభాగ ఎక్స్పర్ట్ మిగతా మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల రిపోర్ట్స్ ను సైతం పరిశీలన చేయడం వివాదాస్పదంగా మారుతోంది. రక్త నమూనా ఫలితాల పట్ల అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

సిబ్బందిని వాడుకోకపోవడం పట్ల విమర్శలు...

నర్సంపేటలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్స్ సంఖ్యకు కొదువ ఏమీ లేదన్నది అధికారుల మాట. ఇలాంటి క్రమంలో ఉన్న సిబ్బందికి విధులు చూపెట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభాగాల వారీగా సంఖ్య పరంగా సరిగ్గానే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ సేవల్లో మాత్రం నిర్లక్ష్యం కనపడుతున్న పరిస్థితి.

ప్రైవేట్ లోనూ డ్యూటీలు..?

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పరిధిలో పని చేస్తున్న కొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలో జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ క్లినిక్ లో పని చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుందన్న వాదనలు లేకపోలేదు. డాక్టర్ల హాజరు శాతంలోనూ తేడాలు వస్తున్నట్లు, బయో మెట్రిక్ లోనూ అవకతవకలు జరిగినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story