- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా తగ్గిపోయిన భూగర్భజల మట్టాలు
వానాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ భారీ వర్షాలు నమోదు కాలేదు.

వానాకాలం మొదలై రెండు నెలలు దాటినా ఉమ్మడి వరంగల్జిల్లాలో భారీ వర్షాలు లేవు. చెరువులు, బావుల్లో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరువు పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. సగం విస్తీర్ణంలో పంటలు వేయని రైతులు భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయాలని రైతులకు విన్నవిస్తున్నా సమయం గడిచిపోవడంతో వరి నాట్లకే మొగ్గు చూపుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధిలో 268 గ్రామాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గిపోయి పంటల సాగు భారీగా తగ్గింది. 734 గ్రామాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 16 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసినా ఇప్పటి వరకు ఏడున్నర లక్షల ఎకరాల సాగు దాటలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ యేడు ఎల్నినో ప్రభావం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
దిశ, వరంగల్ బ్యూరో: వానాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ భారీ వర్షాలు నమోదు కాలేదు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసినా మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో రెండు నెలలైనా సరాసరి సగటు వర్షపాతం మాత్రం నమోదు కాలేదు. కొన్ని మండలాల పరిధిలో వర్షం ఓ మోస్తారు పడ్డ భూగర్భ జలాలు పెరగలేదు. ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలమట్టాలు భారీగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరువు పరిస్థితులు..
ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు లేక సాగు భారీగా పెరగలేదు. ఇప్పటికీ నిర్ణయించిన విస్తీర్ణంలో సగం వరకే సాగు జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు పడిపోవడంతో ఆరుతడి పంటలతో పాటు ఇతర పంటల సాగు పెరగడం లేదు. అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్న రైతులు మాత్రం మొగ్గు చూపడం లేదు. సమయం రెండు నెలలు దగ్గర పడుతుండటంతో నారుమల్లు సిద్ధం చేసిన రైతులు వరినాట్లకే మొగ్గు చూపుతున్నారు. బావులతో పాటు దేవాదుల ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధిలో 268 గ్రామాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోయి పంటల సాగు భారీగా తగ్గింది. వరంగల్ లో 52, హన్మకొండలో 69, మహబూబాబాద్ లో 72, జనగామలో 72, ములుగులో 3 గ్రామాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 734 గ్రామాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఏర్పడగా 491 గ్రామాల్లో కొంతమేర పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈయేడు సాగు భారీగా జరుగుతుందని అంచనా వేసిన వర్షాలు లేక కరువు పరిస్థితి కనబడుతుంది.
ఇప్పటి వరకు లక్ష ఎకరాలలోపే వరిసాగును..
ఉమ్మడి జిల్లా పరిధిలో అత్యధికంగా పత్తి సాగు అవుతుందని అంచనా వేసిన ఇప్పటి వరకు 4లక్షల ఎకరాలు దాటలేదు. అధికారుల లెక్కల ప్రకారం ఐదున్నర లక్షల ఎకరాలకు పైగా సాగు అవుతుందని అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 16 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు అవుతాయని అంచనా వేసినా ఇప్పటి వరకు ఏడున్నర లక్షల ఎకరాల సాగు దాటలేదు. భారీ వర్షాలు లేకపోవడంతో రైతులు ఇతర పంటల సాగుకు మొగ్గు చూపడం లేదు. వర్షాలు పడితే ఉమ్మడి జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాల వరకు వరి సాగు అవుతుందని అంచనా వేసిన ఇప్పటి వరకు లక్ష ఎకరాలలోపే వరిసాగును చేశారు. ఎస్సారెస్పీలో నీళ్లు లేకపోవడం దేవాదులతో పూర్తిగా చెరువులు నింపకపోవడం, భారీ వర్షాలు లేక పంటల సాగు పెరగలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. భారీ వర్షాలు పడితే వరిసాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో లక్షల ఎకరాల్లో వరిసాగు కోసం నారుమల్లు సిద్ధం చేసిన రైతులు అదును కోసం ఎదురు చూస్తున్నారు. సన్నరకాలతో పాటు దొడ్డురకాలు సాగు చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. వరిసాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు.
భూగర్భ జలమట్టాలు..
జిల్లా జూన్ జూలై (మీటర్లలో)
భూపాలపల్లి 12.26, 12.95
హన్మకొండ 7.39 7.39
జనగామ 8.28 8.95
మహబూబాబాద్7.1 7.24
ములుగు 8.9 9.21
వరంగల్ 6.53 6.89






