ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న కోనుగోళ్లలో జాప్యం

by Malleboina Mahesh |

వరంగల్ మక్క రైతుల గోస! కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షణ. మద్దతు ధర రాక, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీతో రైతుకు తప్పని తిప్పలు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న కోనుగోళ్లలో జాప్యం
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నా మొక్కజొన్న రైతుల గోస తీరడం లేదు. మార్క్​ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించినా అమ్మకం జరగడం లేదు. మరికొన్ని చోట్ల గన్నీ బ్యాగులు లేక వాహనాలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ ఫెడ్ గోదాములు జిల్లాలో లేకపోవడం కొనుగోలు చేసిన మక్కలను ఇతర జిల్లాలకు తరలించడంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ లో వ్యాపారులకే అమ్మకానికి మొగ్గు చూపినా వారి సిండికేట్ తో ధర రావడం లేదు.

7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు..

ఉమ్మడి జిల్లాలో భారీగా మొక్కజొన్న సాగైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 7 లక్షల ఎకరాల వరకు పైగా మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన నెలరోజులుగా పంటను కోస్తున్నారు. మార్కెట్ కు తీసుకువచ్చి మొక్కజొన్నలు అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 నిర్ణయించింది. ఈ ధరకే వ్యాపారులు కొనుగోలు చేయాలి. గడిచిన నెలరోజులుగా వ్యాపారులు క్వింటాలు రూ.1750 నుంచి రూ.2వేల మధ్యనే కొంటున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లలో ఇదే ధర వస్తుంది. రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేసే వ్యాపారులు కూడా అంతకు మించి ధర పెట్టడం లేదు.

రైతులు కూడా మొదట మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు ఎదురు చూసినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో 20 రోజుల పాటు వ్యాపారులకే అమ్మకాలు చేశారు. పది రోజుల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 కేంద్రాల వరకు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ జిల్లాల పరిధిలో మొక్కజొన్న సాగైంది. వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్నను సాగు చేశారు. ఈ రెండు జిల్లాల పరిధిలోనే మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా సాగైంది. సాగునీరు వసతి లేకపోవడం చెరువులు, ప్రాజెక్టుల నుంచి కాలువల పారకం లేకపోవడంతో రైతులు ఎక్కువగా మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మాలంటే మాత్రం వారికి సమస్యలు తప్పడం లేదు.

కొనుగోలు కేంద్రాల ఆలస్యం..

ఉమ్మడి జిల్లాలో మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఏర్పాటు చేశారు. కేంద్రాల ఏర్పాటుతో మక్కలు అమ్మకాలు చేస్తున్నా సమస్యలు తప్పడం లేదు. మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు మద్దతు ధర ప్రకారం 2400 కు కొనుగోలు చేస్తున్నారు. సంచులు, మట్టి, చెత్త పేరు మీద క్వింటాలుకు 2 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. రైతుల వద్దనే హమాలీ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇన్ని చేసిన ఏ రోజుకారోజుకు మక్కలు తీసుకువచ్చిన వారివి కొనడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఉంటే తప్ప అమ్మకాలు కావడం లేదు. గన్నీ బ్యాగుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. రైతులు ఆందోళనలు నిర్వహిస్తే తప్ప వాహనాలను సమకూర్చడం లేదు.

జిల్లాలో తక్కువగా స్టేట్ వేర్‌హౌస్ గోదాములు..

గోదాముల కెపాసిటీ లేకపోవడంతో కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్లతో పాటు ఇతర జిల్లాలకు మొక్కజొన్నలను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని వరంగల్ లో ఇప్పటివరకు 35వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో 40 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం 7 లక్షల ఎకరాలకు పైగా సాగు కాగా 2 లక్షల 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

మరికొన్ని రోజుల పాటు కొనుగోలు చేసేందుకు అధికారులు నిర్ణయించిన మార్క్ ఫెడ్ లో మాత్రం ఎకరాకు 26.50 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. అంతకు పైగా దిగుబడి వచ్చిన రైతులు వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతిరోజు పెద్ద ఎత్తున మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నామని డీఎం రంజిత్ రెడ్డి తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా ఉండాలని గన్నీలు, వాహనాల కొరత ఉన్న అధిగమిస్తూ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

Next Story