- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెప్పుకునే అభివృద్ధి ఏదీ లేదు కాబట్టే విమర్శలు : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
బీఆర్ఎస్ గత పదేళ్లలో చేసిందేమీ లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : బీఆర్ఎస్ గత పదేళ్లలో చేసిందేమీ లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డబ్బు కోసం చేసే రాజకీయాలకే బీఆర్‌ఎస్ పరిమితమైందని అన్నారు. పదేళ్ల పాలనలో అభివృద్ధిని కుంటుపడేసి, ఇప్పుడు విమర్శలనే ఆయుధంగా చేసుకుని జిల్లాల్లో జెమిని సర్కస్ మాదిరిగా పర్యటనలు చేస్తున్నారు” అని ఆయన అన్నారు. చేసిన పనులు లేకపోవడంతో రోజువారీ ఆరోపణలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. మూడు రోజులుగా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తోందని పదేళ్లలో చేయలేని వారు ఇప్పుడు పరిశీలన పేరుతో మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు.
దాదాపు పూర్తికావొచ్చిన దవాఖానను బయట నుంచే చూసి విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక పరికరాలు విదేశాల నుంచి రానున్నందున కొంత జాప్యం సహజమని వివరించారు. వరంగల్ మాజీ నేతలకు ఎమ్మెల్యే సూటి ప్రశ్నలు సంధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించినప్పుడు కానీ, నిధుల కేటాయింపుల విషయంలో కానీ మీ నాయకులను ఎప్పుడైనా ప్రశ్నించారా? మీ కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత, గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఎంత అనే అంశంపై చర్చకు సిద్ధమా?” అని సవాల్ విసిరారు. బినామీ పేర్లతో కోట్ల రూపాయలు కూడబెట్టిన నేతలు ఇప్పుడు పారదర్శకతపై మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. టెక్ స్టైల్ పేరుతో అట్టహాసంగా ప్రకటించిన ప్రాజెక్టులు భూమి దశ దాటలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని, రెండున్నరేళ్లలో తీసుకొచ్చిన పనులు ఎటువంటి అవకతవకలు లేకుండా సాగుతున్నాయని తెలిపారు.
కాంట్రాక్టర్లపై కమీషన్ల ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. “సలహాలు ఉంటే ఇవ్వండి. ఎన్నికల వరకు రాజకీయాలు చేద్దాం. కానీ దాడుల రాజకీయాలను నేను ఎప్పుడూ ప్రోత్సహించలేదు” అని అన్నారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఎన్నికల సమయంలో తప్పకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని, మీ ఓటు హక్కు వినియోగించుకోలేని పక్షంలో గూండాలు రౌడీలు రాజ్యమేలుతారని, చదువుకున్న విజ్ఞానవంతులుగా మీరు సరైన సమయంలో రానున్న ఎన్నికల్లో నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ప్రజల తీర్పే తుది తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, జిల్లా ఆర్టీఏ మెంబెర్ పల్లకొండ సతీష్, ఆలయ కమిటీ డైరెక్టర్ సతీష్, బ్లాక్ అధ్యక్షులు బంక సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, నాయిని లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.






