- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు
హనుమకొండ జిల్లాలో ‘రైతుగోస - బీజేపీ భరోసా’ బస్ యాత్ర ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ముఖ్య నేతల బృందం సందర్శించింది.

దిశ, ఆత్మకూర్ : హనుమకొండ జిల్లాలో ‘రైతుగోస - బీజేపీ భరోసా’ బస్ యాత్ర ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ముఖ్య నేతల బృందం సందర్శించింది. కేంద్రంలో ధాన్యం రాశుల వద్ద ఇబ్బందులు పడుతున్న రైతులతో నేతలు స్వయంగా మాట్లాడి, కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను, ప్రతిపక్షాలను ధబాయించడం సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బంద్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. కనీసం గన్నీ బ్యాగులు (సంచులు), కాంటాలు, లారీలు ఏర్పాటు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనలేని మంత్రులు సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లకు, సంచులకు, పరదాలకు, రవాణాకు వంద శాతం నిధులు ఇస్తుంటే.. కొనుగోలు చేయడం చేతకాక కేంద్రంపై నెపం నెట్టడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ధాన్యం సేకరించకపోతే రైతులు ఈ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడం ఖాయమని హెచ్చరించారు.
బీజేపీ శాసనసభ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే 50 శాతానికి పైగా ధాన్యం ఇంకా కళ్ళల్లోనే మూలుగుతోందని అన్నారు. వరంగల్ వేదికగా 'రైతు డిక్లరేషన్' ప్రకటించిన కాంగ్రెస్, నేడు ఇక్కడి రైతులనే నట్టేట ముంచిందని ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడం దుర్మార్గుల పాలనకు అద్దం పడుతోందన్నారు. "మేము బీజేపీ ఎమ్మెల్యేలుగా అడుగుతున్నాం.. మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా?" అని సవాల్ విసిరారు. రైతులకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు మాట్లాడుతూ.. పెట్రోల్ ధరల పెరుగుదలపై మాట్లాడిన పాపానికి ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాన్ని పీకేయడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ తుగ్లక్ పాలనను రాహుల్ గాంధీ చూడాలని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ రైతులకు బేడీలు వేస్తే, నేడు రేవంత్ రెడ్డి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. మాట్లాడిన వారిపై ఇలాంటి అప్రజాస్వామిక, కక్షసాధింపు చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కూడా అధికారంలో ఉండలేదని స్పష్టం చేశారు.
ఈ ‘రైతుగోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావులతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, ఎమ్మెల్సీ CH. ఆంజి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మారెడ్డి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కే. రాజయ్య యాదవ్, చందుపట్ల కీర్తి రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, సిద్ధం నరేష్ పటేల్, ఎడ్ల అశోక్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి, పోతుగంటి భరత్ ప్రసాద్, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఆరుట్ల దశమంత రెడ్డి, మల్లాది తిరుపతి రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షులు మొగిలి, జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆత్మకూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






