కార్పొరేషన్​పై పార్టీల కన్ను.. వరంగల్ బల్దియాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి

by Ajay Maddhiboyina |

ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ రావడంతో వరంగల్ కార్పొరేషన్ పై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

కార్పొరేషన్​పై పార్టీల కన్ను.. వరంగల్ బల్దియాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ రావడంతో వరంగల్ కార్పొరేషన్ పై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అన్ని డివిజన్లలో పార్టీని సైతం బలోపేతం చేస్తున్నారు. రెండు నెలల్లో సభ్యుల పదవీకాలం పూర్తికానుండడంతో ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ధీటుగానే బీఆర్​ఎస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్లపాటు ఉన్న ప్రాతినిధ్యం దక్కించుకునేందుకు సిద్ధం అవుతుండగా పలు డివిజన్లపై బీజేపీ, వామపక్ష పార్టీనేతలు నజర్ పెట్టారు.

మే9తో ముగియనున్న పదవీకాలం..

వరంగల్ కార్పొరేషన్ పాలకమండలి సభ్యుల పదవీకాలం మే 9వతేదీతో పూర్తవుతుంది. పాలకమండలి సభ్యుల పదవీకాలం పూర్తి కాగానే ఎన్నికలను నిర్వహించనున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాలు వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ ఈస్ట్, వెస్ట్ లో ఎక్కువ డివిజన్లు ఉండగా, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గంలో తక్కువ డివిజన్లు ఉన్నాయి. గత రెండు పర్యాయాలు వరంగల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ సభ్యులు గెలిచారు. మేయర్ ఆ పార్టీ నేతలే గెలుచుకున్నారు. నగర కార్పొరేషన్ లోని ఈ డివిజన్ల పరిధిలో ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. పదవీకాలం పూర్తయ్యేలోపు ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులన్నీ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు ఇతర పనుల కోసం రూ.4వేల కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధుల ద్వారా పనులను చేపడుతున్నారు. వరంగల్ పరిధిలోని 66 డివిజన్ లో పలు డ్రైనేజీల నిర్మాణం, బ్రిడ్జిలు ఇతర మౌలిక వసతుల కోసం కేటాయించారు. వేస్ట్ మేనేజ్ మెంట్ కోసం కూడా నిధులను కేటాయించారు. వీటిలో కొన్ని పనులను చేపట్టడంతో పాటు మరికొన్ని పనులను శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీ లు గెలిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కార్పొరేషన్ పై దృష్టి పెట్టారు. అన్ని డివిజన్లు గెలిస్తే ఉమ్మడి జిల్లాలో తిరుగుండదని లక్ష్యంతో పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు పనులు చేస్తున్నారు. డివిజన్ల వారీగా పనులను చేపడుతున్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె నియోజకవర్గంలో అందుబాటులో ఉండి పనులను చేపడుతున్నారు. అన్ని డివిజన్లు కలియ తిరుగుతూ పనులను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించడంతో పాటు పనులన్నీ పూర్తి చేస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తమ డివిజన్ల పరిధిలో పనులను చేస్తున్నారు. ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ లో మెజార్టీ సీట్లను సాధించేందుకు పావులు కదుపుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మెజర్టీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా ఈ దఫా తమ పార్టీ గెలుచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

పట్టునిలుపుకునే దిశగా బీఆర్ఎస్​..

కాంగ్రెస్ మాదిరిగానే బీఆర్ఎస్ నేతలు కూడా దృష్టి పెట్టారు. వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, అరూరు రమేష్, చల్ల ధర్మారెడ్డి పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్ బలోపేతంపై దృష్టి పెట్టారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో తమ ప్రాతినిధ్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా మెజార్టీ డివిజన్లు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పార్టీతో పాటు బీజేపీ నేతలు కూడా దృష్టి పెట్టారు. తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగానే కొన్ని డివిజన్లు సాధించుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు, ఎంఐఎం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల ఎన్నికలు పూర్తికావడంతో పార్టీల చూపంతా వరంగల్ కార్పొరేషన్ పై పడింది. పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యే లోపు కార్పొరేషన్ లో పార్టీల కార్యక్రమాలు ఊపందుకునే పరిస్థితి ఉంది.

Next Story