ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయండి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కావటి ముత్యాలు

by Ratna Kumari |

రైతు సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ నాయకులను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు గురిచేయడం వారి నిరంకుశత్వానికి, అవివేకానికి నిదర్శనమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కావటిముత్యాలు అన్నారు.

ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయండి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కావటి ముత్యాలు
X

దిశ‌, రఘునాథ‌ప‌ల్లి : రైతు సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ నాయకులను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు గురిచేయడం వారి నిరంకుశత్వానికి, అవివేకానికి నిదర్శనమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కావటిముత్యాలు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చిత్తశుద్ధి లేదని బీజేపీ నాయకులు చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సింది పోయి, ఎమ్మెల్యే అనుచరులు “ఖబడ్దార్” అంటూ హెచ్చరికలు చేయడాన్ని బీజేపీ రఘునాథపల్లి మండల శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న ఇబ్బందులు, రైతులకు జరుగుతున్న అన్యాయాలపై మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధం అన్నారు.


ప్రజా సమస్యలపై ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆ హక్కును కాలరాస్తూ బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మీ ఉడుత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అన్నారు. రైతుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ ఎప్పటికీ గొంతెత్తుతూనే ఉంటుంది అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోతే, రైతులకు 2లక్షల రుణ మాఫీ చేయకపోతే, 2ఎకరాల మీద భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనియ్యరన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు కల్పగూరి ప్రభాకర్, వల్లాల ఉపేందర్, మేడిపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బోళ్ల అఖిల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట మహేష్, వల్లాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story