భీమారంలో టీబీ–ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్..

by Kodari Anjali |

టీబీ, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.

భీమారంలో టీబీ–ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్..
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: ఆరోగ్యపరంగా అధిక ప్రమాదం (హైరిస్క్) ఉన్న వర్గాల కోసం వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న క్షయవ్యాధి (టీబీ), అసంక్రమిత వ్యాధుల (NCD) స్క్రీనింగ్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పిలుపునిచ్చారు. శనివారం హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని భీమారం పాత గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన టీబీ, ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు శిబిరం నిర్వహణ, అందిస్తున్న సేవలపై కలెక్టర్‌కు వివరించారు. 30 సంవత్సరాలు పైబడిన వారికి రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముందుగానే గుర్తించి సకాలంలో...

అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గతంలో టీబీ చికిత్స పొందిన వారు, వారి కుటుంబ సభ్యులు, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు, ధూమపానం చేసే వారు, రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికి మొబైల్ డిజిటల్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. క్షయవ్యాధిని ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభించడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ, మొబైల్ ఎక్స్‌రే సేవలు, నిక్షయ్ పోర్టల్, ఎన్‌సీడీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు ప్రక్రియను పరిశీలించారు. టీబీ చికిత్స పొందుతున్న లబ్ధిదారులకు పోషకాహార కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యం దేశంలో క్షయవ్యాధి నిర్మూలనేనని తెలిపారు.

టీబీ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం...

టీబీ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం అత్యాధునిక, ఖరీదైన చికిత్సను పూర్తిగా ఉచితంగా అందిస్తోందని చెప్పారు. టీబీ రోగులకు చికిత్స కాలంలో నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రతి నెల రూ.1,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. క్షయవ్యాధిపై ఎలాంటి అపోహలకు లోనుకాకుండా రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, హసన్‌పర్తి తహసీల్దార్ కిరణ్ కుమార్, వైద్యాధికారులు డాక్టర్ భరత్, డాక్టర్ మానస, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, టీబీ యూనిట్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Next Story